ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభమై నాలుగేళ్ళు పూర్తైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ శ్రేణులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఫోటోకు పాలాభిషేకాలు, ఆ చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్కడికక్కడ పాదయాత్రలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
“మహానేత వైయస్ఆర్ గారి తనయుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ఆయన తొలి అడుగు పడి నేటికి సరిగ్గా నాలుగేళ్ళు. ఓ సమర్ధుడైన పాలకుడి కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్న ఆ సమయంలో 2017 నవంబర్ 6వ తేదీన, నేనున్నానంటూ వైఎస్ జగన్ గారు ముందడుగు వేశారని, ఆ అడుగులే కోట్ల మంది ప్రజల గుండె చప్పుళ్ళు అయ్యి, రాష్ట్రంలోని అట్టడుగు, బడుగు, బలహీన, పేదవర్గాల ప్రజలకు ఒక నమ్మకాన్ని, భరోసాను ఇచ్చాయి. నాటి జగన్ గారి అడుగులే… పేదల తలరాతలు మార్చే నవరత్నాల పథకాలయ్యాయి. నాడు ఆయన చిందించిన చెమట చుక్కలే నేడు రాష్ట్రమంతటా సంక్షేమ-అభివృద్ధి ఫలాలయ్యాయి.” అంటూ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభమై నాలుగేళ్ళు పూర్తైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.
పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… పరిపాలనను గ్రామ స్థాయికి… సంక్షేమాన్ని గడప స్థాయికి… రైతు ప్రయోజనాలను గట్టు స్థాయికీ చేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ గారికే దక్కుతుందన్నారు. ఇదంతా కూడా ప్రజా సంకల్ప పాదయాత్ర స్పూర్తి అని ఆయన తెలిపారు. దేశంలోనే కులం, మతం, పార్టీలు, ప్రాంతాలు అన్న పట్టింపులు లేకుండా పరిపాలన చేస్తున్న ఏకైక సీఎం జగన్ అని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజలను దోచుకు తిన్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పుడు జగన్ గారు ఏర్పాటు చేసిన సచివాలయాలు ప్రజల చెంతకే సంక్షేమ ఫలాలను చేరుస్తున్నాయని తెలిపారు. నగదు పంపిణీపై విమర్శలు గుప్పించే వారికి అందులో సంక్షేమం తప్ప అభివృద్ధి కనిపించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. సంక్షేమంలో నుంచే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సునిశితంగా పరిశీలించే వారికి మాత్రమే ఒక కంటికి సంక్షేమం, మరో కంటికి అభివృద్ధి కనిపిస్తుందని ఆయన వివరించారు. వచ్చే వెయ్యేళ్ళలో ఎవరూ మర్చిపోలేని రీతిలో జగన్ గారి పాలన కొనసాగుతుందని ఉమ్మారెడ్డి చెప్పారు.