రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. మొదటిరోజు 4,793 మంది మహిళలకు స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గత బుధవారం ఈ కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కరీంనగర్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన తొలి మంగళవారం కావడంతో 24 జిల్లాల్లో 100 కేంద్రాల్లో ఆరోగ్య మహిళ సేవలు ప్రారంభం అయ్యాయి.
ఆయా కేంద్రాల్లో మహిళలకు వైద్య పరీక్షలు చేసి, 975 మందికి అవసరమైన మందులు అందజేశారు. మొదటి దశలో 100 కేంద్రాల్లో సేవలు ప్రారంభం కాగా.. దశల వారీగా వీటిని 1200 కేంద్రాలకు పెంచనున్నారు. ఈ క్లినిక్‌ల ద్వారా మహిళలకు బీపీ, షుగర్‌తోపాటు క్యాన్సర్ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు అందిస్తారు. 8 ప్యాకేజీల్లో 57 రకాల టెస్టులు అందుబాటులో ఉంటాయి.
ప్రాథమిక టెస్టులతోపాటు పోషకాల లోపం, సంతానలేమి, మెనోపాజ్, ఎస్టీడీ, పీసీవోడీ, ఐవీ తదితర సమస్యలకు చికిత్సలు అందిస్తారు. క్యాన్సర్ తదితర తీవ్ర సమస్యలు ఉంటే నిమ్స్, ఎంఎన్‌జే వంటి పెద్ద దవాఖానలకు రెఫర్ చేస్తారు. ఈ ఉమెన్ క్లినిక్‌లకు వచ్చే రోగుల వివరాలన్నీ ప్రత్యేక యాప్‌లో పొందుపరుస్తారు. వీటిని రెఫర్ దవాఖానలకు లింక్ చేస్తారు. ఆయా దవాఖానల్లో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.