బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం – బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రసంగం – ఇతర ముఖ్యాంశాలు
బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, పలు కార్పోరేషన్ల ఛైర్మన్ లు, మేయర్ లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 3.20 కి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తొలుత ఇటీవల మరణించిన పార్టీ ఎమ్మెల్యే బండి సాయన్న చిత్రపటానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశాన్ని ప్రారంభిస్తూ బండి సాయన్న మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబానికి దు:ఖాన్ని తట్టుకునే శక్తిని కల్పించాలని భగవంతున్ని ప్రార్థించారు. సమావేశం సాయన్న మరణానికి సంతాపం ప్రకటిస్తూ కాసేపు మౌనం పాటించింది.
ఈ సందర్భంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గారి ప్రసంగంలోని ముఖ్యాంశాలు :
తెలంగాణ రాష్ట్ర ప్రగతి :
తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో దేశంలోనే ముందు వరుసలో దూసుకుపోతుంది. స్వయంపాలనను విఫలయత్నంగా చేయాలని ప్రారంభదశలో సృష్టించిన అనేక అడ్డంకులను దాటుకొని మనం నిలబడ్డాం. తెలంగాణ రాష్ట్రం సాధించిన పురోగతిని చూసిన ఆ తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికలో ప్రజలు మనకు అండగా నిలబడ్డారు. విద్యుత్ కోతలు లేకుండా చేసుకున్నాం. సాగునీటి రంగాన్ని తీర్చిదిద్దుకున్నాం. ఇవాళ ప్రతీ ఇంటికి తాగునీరు నల్లాల ద్వారా అందుతున్నది.
సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తెలంగాణ చేరుకున్నది. వరి పంట ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది. పసిపిల్లలు, ముసలివాళ్ళ నుంచి ఆడబిడ్డలు వరకు, రైతన్నల నుంచి ఐటి, పరిశ్రమల వరకు ప్రతీ రంగంలో సంక్షేమం, అభివృద్ధి సాధిస్తూ తెలంగాణ రాష్ట్రం నేడు సమ్మిళితాభివృద్ధిని సాధించింది. ఇవాళ విదేశాల నుంచి తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతున్నది. మన పారిశ్రామిక విధానాలను ప్రపంచం మెచ్చుకుంటన్నది.
ప్రపంచ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు ఐటి రంగంలో సిలికాన్ వ్యాలీగా చెప్పుకున్న బెంగుళూరును మించి హైదరాబాద్ ఐటి రంగంలో పురోగతిని సాధిస్తున్నది. మొన్న వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ ఫాక్స్ కాన్ ఛైర్మన్ తెలంగాణ అభివృద్ధిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పడం మనందరికీ గర్వకారణం. ఇంతటి అభివృద్ధి సాధించిన మన పార్టీ ఘనవిజయాలను గుర్తు చేసుకుంటూనే, మరింతగా ప్రజల్లోకి మన పార్టీని, మన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది.
తెలంగాణ ప్రగతిని బిజెపి పార్టీ ఓరుస్తలేదు :
తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని బిజెపి పార్టీ ఓర్వలేకపోతున్నది. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్న నేపథ్యంలో తమ పార్టీ చేతకాని తనం బయటపడుతుందనే అక్కసుతో అనేక కుట్రలకు బిజెపి పాల్పడుతున్నది. టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులను వేధిస్తున్నది. ఇప్పటికే మన పార్టీ మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీని సిబిఐ, ఐటి, ఈడి దాడులతో తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నది. బిజెపి వేధింపులను ఎంతవరకైనా తిప్పికొడతాం. ఎదుర్కొంటాం. ఈ దేశం నుండి బిజెపి పార్టీని పారద్రోలేవరకు మన పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.
ప్రజాప్రతినిధులకు ఆదేశాలు :
బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం. వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. ఇందుకు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి. ప్రతీ పది గ్రామాలను యూనిట్ గా తీసుకొని ఎమ్మెల్యేలు పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలి. ఈ సమ్మేళనాల్లో స్థానిక ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, కార్పోరేషన్ ఛైర్మన్ లను డిసిసిబి, డిసిఎంఎస్ తదితర పార్టీ ముఖ్యులను కలుపుకొని పోవాలి. ఈ ఆత్మీయ సమ్మేళనాలను రెండు నెలల్లోపు పూర్తి చేయాలి. ప్రజాప్రతినిధులు వీలయినంత వరకు ప్రజల్లోనే ఉండాలి.
కంటి వెలుగు శిబిరాలతో ప్రజల్లో మంచి స్పందన వస్తున్నది. వీటిని స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిరోజు ఒక బాధ్యతగా సందర్శించాల్సిన అవసరం ఉన్నది. త్వరలో నిర్వహించబోయే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కోసం కూడా ప్రజాప్రతినిధులు సిద్ధమై ఉండాలి.