శాంతి భద్రతల పరిరక్షణ, సిబ్బంది పనితీరు సమీక్ష మరియు నేరాల అదుపు చర్యలలో భాగంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, మీర్పేట్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్మెట్, సరూర్నగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్లను కమిషనర్ శ్రీ డిఎస్ చౌహన్ ఐపిఎస్ గారు సోమవారం అర్థరాత్రి అకస్మాత్తుగా సందర్శించి సిబ్బంది పనితీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా స్టేషన్లో రాత్రిపూట విధుల్లో ఉన్న సిబ్బంది, పెట్రోల్ కార్లు మరియు బ్లూ కోల్ట్స్, కానిస్టేబుల్ మరియు ఇతర స్థాయిల అధికారుల పనితీరు పరిశీలించారు. అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. రాత్రి పూట విధుల్లో మరింత శ్రద్ధగా పనిచేయాలని, తద్వారా స్మగ్లింగ్ వంటి వివిధ రకాల అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవచ్చని తెలిపారు. రాత్రి పూట పని చేసే ఉద్యోగులు, మహిళలు మరియు ఇతరులకు ఎటువంటి వేదింపులు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
అత్యవసర సహాయం కోసం వచ్చే ఫోన్ కాల్స్ కు తక్షణమే స్పందించి, బాధితులకు సత్వర న్యాయం అందించాలని పేర్కొన్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది సమర్థవంతంగా పని చేసేలా మానిటర్ చేస్తూ ఉండాలని అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్లకు సంబంధించిన వెహికల్ చెకింగ్ పాయింట్స్ లను సందర్శించి ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా చూడాలని, గంజాయి స్మగ్లింగ్ ను అరికట్టాలని సిబ్బందికి సూచించారు.