పథకంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తాం, త్వరలో వర్సిటీ ప్రొఫెసర్లతో కమిటీ వేస్తాం, దేశం గర్వించేలా పథకాన్ని అమలుచేయాలి, మీడియాతో ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, దళిత సాధికారతకు ఊతకర్ర: ప్రొఫెసర్ ప్రభంజన్‌యాదవ్, దళితబంధుకు చట్టరూపమివ్వాలి: పసునూరి రవీందర్.
దళితబంధు పథకాన్ని దేశం గర్వించేలా అమలు చేయాలని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ సూచించారు. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు చేయని గొప్ప పని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేస్తున్నారని కొనియాడారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో దళిత బహుజన ప్రొఫెసర్లు, మేధావులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత మేధావులుగా దళితబంధు పథకాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. తరతరాలుగా ఆర్థికంగా, సామాజికంగా వివక్షకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకానికి దన్నుగా ఉంటామని ప్రకటించారు. ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతదేఠశంలో జాతీయస్థాయిలో కానీ, రాష్ర్టాలస్థాయిలో కానీ దళితజనోద్ధరణ కోసం ఇలాంటి పథకాన్ని తేవాలనే ఆలోచనే ఎవరూ చేయలేదని అన్నారు. తెలంగాణ ఏర్పడి కొద్దికాలమే అయినా దేశంలోనే అందరికన్నా ముందు ఉన్నదని ప్రశంసించారు. రాష్ట్రంలోని దళితులందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని, వచ్చే మార్చిలో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినందుకు దళితజాతి పక్షాన కృతజ్ఞతలు చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల నుంచి మేధావులతో కమిటీ వేసి పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తామని, ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేస్తామని తెలిపారు. ఈ పథకం గురించి కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని దళితబహుజన మేధావులు, సామాన్య ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ పథకం ఫలితాలను బట్టి ఆయా రాష్ర్టాల్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పెనుమార్పులు రావడం ఖాయమని చెప్పారు.
దళిత సాధికారతకు ఊతకర్ర: ప్రొఫెసర్ ప్రభంజన్‌యాదవ్
———————————————
దళితబంధు పథకం దళితజాతికి ఊతకర్రలా పనిచేస్తుందని ప్రొఫెసర్ ప్రభంజన్‌యాదవ్ అన్నారు.ప్రభుత్వ మంచిపనులను బుద్ధిజీవులుగా తాము ఎప్పుడూ స్వాగతిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం విజయం సాధించి దేశానికి మార్గదర్శనం చేసిందని, దళితబంధు పథకం దేశంలో కొత్త చరిత్రను సృష్టించబోతున్నదని ప్రొఫెసర్ నెథన్యాల్ అన్నారు. తరతరాలుగా ఊరికి దూరంగా ఉన్న దళితవర్గాలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే అద్భుత కార్యాచరణకు సీఎం కేసీఆర్ తొలి అడుగువేశారని కొనియాడారు. ఆర్థికంగా చితికిపోయిన దళితజాతి ఉద్ధరణకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఆహ్వానించదగ్గదని కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ అన్నారు. ఈ పథకం ప్రతి దళితగడపకు చేరాలని ఆయన ఆకాంక్షించారు. పథకంపై ప్రభుత్వం చట్టం చేయాలని కోరారు. సమావేశంలో మాల మాదిగల ఉపకులాల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఏకు తిరుపతి, సీపీఐ నాయకులు వలీ ఉల్లా ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.