కలరాను కట్టడి చేయడంలో ఓ.ఆర్.ఎస్. ద్రావకం ఎంతటి ప్రాచుర్యం పొందిందో మనందరికీ తెలిసిందే…! అయితే, దీని ఆవిష్కరణకర్త ఎవరూ బహుశా అందరికీ తెలిసి వుండదు. ఆయన పేరు డా.దిలీప్ మహాలనబిస్. నిజానికి డా.దిలీప్ పిల్లల వైద్య నిపుణులు. 88 ఏళ్ల వయసున్న ఆయనను కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా కోల్ కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా అక్టోబర్ 16వ తేదీ, ఆదివారం కన్ను మూశారు.
కోల్ కతాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ కోల్ కతాలో రీసెర్చ్ స్కాలర్ గా, 1966లో ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ ప్రాజెక్టుపై పనిచేశారు. డాక్టర్ డేవిడ్ ఆర్నలిన్, డాక్టర్ రిచర్డ్ ఏ క్యాష్ తో కలసి పరిశోధనలో పాల్గొన్నారు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటే ఓఆర్ఎస్ ద్రావకాన్ని ఆయన అభివృద్ధి చేశారు.
‘ఓఆర్ఎస్ గొప్ప ఆవిష్కరణ.ఈ ఫార్ములేషన్ తయారీ, ఓఆర్టీకి ప్రాచుర్యం కల్పించడంలో మహాలనబిస్ చేసిన సేవలు అపారమైనవి. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సమయంలో కలరా మహమ్మారి కారణంగా మరణాలను తగ్గించడంలో ఓఆర్ఎస్ ఎంతో సాయపడింది’ అని ఐసీఎంఆర్ – నిసెడ్ డైరెక్టర్ శాంతా దత్తా పేర్కొన్నారు.
అంతకు ముందే ఓఆర్ఎస్ ను అభివృద్ది చేసినప్పటికీ బంగ్లాదేశ్ యుద్ధ సమయంలోనే దానికి ప్రాచుర్యం లభించింది.
లక్షలాది మంది శరణార్థులు భారత్ లోని సరిహద్దు జిల్లాల్లోకి వలస రావడం చోటు చేసుకుంది. బోంగాన్ శరణార్థి శిబిరంలో కలరా పెద్ద ఎత్తున విజృంభించడంతో అక్కడి బాధితులకు ఓఆర్ఎస్ ను దిలీప్ మహాలనబిస్ అందించారు. దీంతో మరణాల రేటు 30 శాతం నుంచి 3 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత నుంచి ఓఆర్ఎస్ కు ప్రపంచవ్యాప్తంగా ఆమోదనీయం పెరిగింది. 20వ శతాబ్దపు గొప్ప ఆవిష్కరణగా పేరొందింది. ఆయనకు ఎన్నో ప్రఖ్యాత సంస్థల నుంచి అవార్డులు లభించాయి. ఏంతోమంది జీవితాలకు ఓ.ఆర్.ఎస్. ద్వారా వెలుగులు నింపి మనల్ని వీడి వెళ్లిన డా.దిలీప్ మహాలనబిస్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం…!!


























