Naatu Naatu Song : రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన “ఆర్ఆర్ఆర్” లోని నాటు నాటు ఈ పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. తెలుగు వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ గర్వపడేలా చేసిన ఈ సాంగ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఈ పాటకి సినీ రంగంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ కూడా వరించింది.
ఇక ఆస్కార్ గెలుచుకొని ఇండియాకు తిరిగి వచ్చిన ఆర్ఆర్ఆర్ టీంకు ఇక్కడ గ్రాండ్ గా వెల్కమ్ చెబుతున్నారు. ఇక నాటు నాటు సాంగ్ ని అందరూ ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ నాటు నాటు సాంగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాటు నాటు పాట వినపడందే తన కొడుకు అన్నం తినట్లేదు అనడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
కరీనా వ్యాఖ్యాతగా “వాట్ ఉమెన్ వాంట్” అనే ఓ షో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్ లో కరీనా నాటు నాటు గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాటు నాటు పాట చరిత్ర సృష్టించింది. చిన్న పిల్లల మనసు సైతం ఈ పాట కొల్లగొట్టింది. నా చిన్న కొడుకు జెహ్ నాటు నాటు పాట పెడితే కానీ అన్నం తినట్లేదు. అది కూడా తెలుగులోనే వినడానికి ఇష్టపడుతున్నాడు. జెహ్ కి ఆ పాట బాగా నచ్చింది. ఆ పాట వినపడినప్పుడల్లా సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నాడు. ఆస్కార్ గెలిచిన పాట ప్రేక్షకులని ఎంతగా మ్యాజిక్ చేసిందో ఇదే ఉదాహరణ అని తెలిపింది. దీంతో కరీనా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.