“The Kashmir Files” Movie Late Review by Sr Journalist Audi
ఈ సినిమా చూశాక నా గుండె పిండేసినట్టు అయిపోయింది.. క్లైమ్యాక్స్ లో విలన్ పాతిక మందిని చంపడం, అందునా బాలుడైన శివ పండిట్ ను నిలువునా కాల్చడం.. అతడి తల్లి శారద పండిట్ ఒక మహిళ తన గురువు కూతురని కూడా చూడకుండా ఆమెను నిలువునా రంపపు కోత కోయడం చూసి.. ఒక జాతి మీదే అసహ్యం పుట్టేంత దారుణ మారుణ కాండను కళ్లకు కట్టించాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. కాశ్మీర్ లో ఈ విధ్వంసం జరిగిందా? జరగలేదా? నా చర్చ కాదు.. కానీ సమాజ స్పందన నా చర్చ.. ఈ విషయంలో కూడా ఎప్పటిలాగానే రెండుగా చీలిపోయి కొట్టుకుంది నా ప్రియమైన సమాజం.. మరీ ముఖ్యంగా హిందూ సంఘాలన్నీ కశ్మీర్ పండిట్ల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేయగా.. దళిత- బహుజన- మైనార్టీ సంఘాలు అది పెద్ద విషయమే కాదని డైల్యూట్ చేయడం స్టార్ట్ చేశాయి.. వీళ్లందరి వాదనలు చూశాక- విన్నాక- చదివాక.. చావు- పుట్టుకలకు మతం రంగు లేదన్న భ్రమలు నాలోంచి తొలగిపోయాయి..
నేను కూడా అర్జంటుగా సగటు భారతీయుడనే ముసుగు తొలగించేసి.. ఏ కాషాయమో కప్పుకునేసి.. ఏ హిందుత్వ కండువాను తొడుక్కుని.. భారత్ మాతాకీ జై అనేయాలనిపించేసింది.. ఇదంతా అలా ఉంచితే.. నా చుట్టూ ఉన్న జనాభాలో ఒకానొక కరడుగట్టిన మనస్తత్వం ఏదో మరింత కరడుగట్టుకుని పోతున్నట్టు కనిపించింది.. కొన్ని విషయాల్లో ఎంతో ఎంతెంతో ఎంతెంతోతో సునిశితంగా చర్చించి విశ్లేషించి విడమరచే కొందరు మేతావులు కశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపిన ఘట్టాలకు కనీసం మౌనమైనా పాటించకుండా ఈ మారణ కాండకు వ్యతిరేకంగా కథనాలు పుట్టించి ఆధారాలు సేకరించి.. నానా గడ్డి కరిచిన విధం కళ్లకు కట్టింది.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇది లేదు.. నిజానికి అంబేద్కరిజాన్ని కానీ పెరియార్ పాలసీని కానీ ఫాలో అయితే.. బాధితుల పక్షాన నిలవడం మనందరి విధి, తక్షణ కర్తవ్యం కూడా.. కానీ మనం ఎక్కడో ఈ కట్టుబాట్లు తప్పుతున్నాం.. అందుకు సవాలక్ష కారణాలుండవచ్చు..
ఈ మధ్య ఒక స్నేహితుడు ఫోన్ చేశాడు.. అతడికి టీవీయాంకర్ దేవి వర్సెస్- విష్వక్ సేన్ విషయంలో తాను ఎవరి పక్షం నిలవాలి అన్నది ఒక పెద్ద మీమాంశ.. ఈ మీమాంశ నుంచి తాను బయట పడాలంటే.. తనకు తక్షణం కావల్సింది.. వీరిలో ఎవరిదే కులం అన్నది తేలాలి.. ఇపుడు దేవిని ఒక మహిళగా తాను సపోర్ట్ చేయాలంటే.. అందుకు ఎదుటి వ్యక్తి యొక్క కులం అడ్డు వస్తుంది.. కాబట్టి అర్జంటుగా నాకు ఫోన్ చేసి విష్వక్ సేన్ కులాన్ని వాకబు చేశాడు.. నాకు తెలిసీ తెలియక అతడో బీసీగా చెప్పుకొచ్చా.. అంటే సొసైటీ థింకింగ్ కులాన్ని బట్టి కేటగిరైజేషన్ అయిపోయింది.. ఇప్పుడు విష్వక్ సేన్ ఓసీ అయితే అతడు సపోర్ట్ రాడు.. అదే బీసీ అయితే కొంత ఆలోచిస్తాడు.. అటు వైపు మహిళను ఎఫ్ వర్డ్ కన్నా మించిన పదం వాడినా వాడు వదిలేస్తాడు.. కారణం.. ఇటు వైపు ఉన్నది ఫలానా కులం కాబట్టి.. కరోనాను మహమ్మారీ అంటే అందుకు స్త్రీలింగం తగిలిస్తావా? అని తన్లాడిన వీడే.. ఇలా ప్లేటు ఫిరాయించేస్తాడన్నమాట.
అదేమంటే అగ్రకుల అహంకారం దాన్లోంచి ఎవడు బాధితుడైనా వాడి బాధను మనం ఎంజాయ్ చేయాలి.. ఫెస్టివ్ మూడ్ కి కన్వర్ట్ చేసు కోవాలనే ఒకానొక బలీయమైన మానసిక స్థితి.. చరిత్రలో చాలానే జరిగి ఉండొచ్చు.. ప్రస్తుతం సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఇంకా ఇలాంటి అవమానాలే ఎదురవుతుండవచ్చు.. వాటిని యూనిట్లు యూనిట్లుగా ఈ సభ్య సమాజం వ్యతిరేకిస్తూనే ఉన్నా సరే.. వాడు తరతరాల తరబడి అగ్రకుల అహంకారాన్ని అణగదొక్కడంలో భాగంగా.. చనిపోయిన వాడి కులం మతం రుంగుల విశ్లేషణ చేసుకుంటూ.. అటు వైపునకు తన త్రాసు తూగేలా చేస్తూ వెళ్తున్నాడు.. అందుకే కావచ్చు కాశ్మీరీ పండిట్ల ఊచకోతను చూసి అదంతా అబద్ధం అని తేల్చేశాడు..
ఇదే సినిమాలో కృష్ణ పండిట్ పాత్ర ఈ మాటే అంటుంది.. కాశ్మీరే అంత.. అది అబద్ధం లాంటి నిజం.. అని.. ఏది ఏమైనా కశ్మీర్ ఫైల్స్ లో వివేక్ అగ్నిహోత్రి చూపించింది అబద్ధం కావాలని కోరుకుందాం.. ఎందుకంటే నా మిత్రుల్లో చాలా మంది అదే నిజమని నమ్ముతున్నారు కాబట్టి.. మనకు వాస్తవాలు అవసరం లేదు.. వాదనలే ముఖ్యం కాబట్టి.. ఈ నా తరానికి ఇదో పెద్ద శిక్ష.. నేను కొన్ని పక్షాల తరఫు నిజమని మాట్లాడకూడదు.. అందుకు నాకు అర్హత లేదు.. కొన్ని పక్షాల పట్ల అబద్ధం కూడా నిజమని ప్రచారం చేసినపుడే ఈ నా సమాజంలో నాకు మనుగడ.. అనుకుంటాం కానీ తలాపున అబద్ధాల కశ్మీర్ ఒక్కటే ఉందని.. అది భారతదేశం నలుమూలలా నాలుగు దిక్కులా వ్యాపించి ఉంది.. కాకుంటే అక్కడ మంచు కొండలుంటాయ్.. ఇక్కడ మాములు కొండలుంటాయ్ అంతే తేడా..
ఇప్పటికే ఎక్కువైంది, ఉంటా బై! “The Kashmir Files” Movie Late Review by Sr Journalist Audi