Rangamarthanda Movie : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘రంగమార్తాండ’. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమాతో వస్తున్నాడు కృష్ణవంశీ. 2017 లో ఆయన తీసిన నక్షత్రం సినిమా డిజాస్టర్ గా మిగిలింది. మరాఠాలో పెద్ద హిట్ సాధించిన నటసామ్రాట్ సినిమాని తెలుగులో రంగమార్తాండగా తెరకెక్కించారు. ఫ్యామిలీ, ఎమోషన్స్ స్టోరీగా ఇది తెరకెక్కింది. రంగమార్తాండలో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక మార్చి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ప్రమోషన్స్ లో జోరు పెంచిన మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో ‘నేనొక నటుడిని..’ అంటూ స్టార్ట్ అయిన ఈ టీజర్‌లో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణలతో పాటు ఇతర నటీనటులను కూడా పరిచయం చేశారు. ఇక బ్రహ్మానందం ఈ సినిమాలో విలక్షణమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘రేయ్.. నువ్వొక చెత్త నటుడివిరా.. మనిషిగా అంతకంటే నీచుడివి’’ అని ప్రకాశ్ రాజ్‌ను బ్రహ్మానందం చెంపదెబ్బ కొట్టే సీన్ ఈ టీజర్‌కే హైలైట్ అని చెప్పాలి.
ఇక రంగమార్తాండ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉంది మైత్రి నిర్మాణ సంస్థ. ఇటీవల సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో వచ్చి భారీ హిట్స్ కొట్టారు. ఈ సినిమాలతోనే మైత్రీ సంస్థ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేయబోతుండడంతో కృష్ణవంశీ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం గ్యారంటీ అని అంతా భావిస్తున్నారు.