Mallanna Sagar Big Reservoir in Kaleshwaram Project, Mallanna Vanam, Siddipet Forest Developments Works, CM KCR, Telangana Tourism, Telugu World Now
Telangana News: సాగరం చెంతనే “మల్లన్న వనం”, సిద్దిపేట జిల్లాలో విస్తృత స్థాయిలో అభివృద్ధి: సీఎం కేసీఆర్
రాజీవ్ రహదారిని ఆనుకొని దట్టమైన అడవి, సీఎం సూచనతో ఆయుర్వేద మొక్కల పెంపకం, తీరొక్క మొక్కలు, అనేక జంతువులకు ఆలవాలం, పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు.
కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దన్న ఎవరంటే మల్లన్నసాగర్ అనే చెప్పాలి. 50 టీఎంసీల ఈ భారీ రిజర్వాయర్ తెలంగాణకు అతిపెద్ద గంగాళం. గోదావరి నుంచి అంచెలంచెలుగా ఎత్తిపోసుకొన్న నీటికి మార్గమధ్యంలో ఇదొక ముసాఫిర్ బంగళా. ఒకపక్క సిద్దిపేట అభయారణ్యం.. దాని అంచున వెలసిన అపూర్వ జలసిరి.. మంద్రంగా వినిపించే అలల సంగీతం.. వనంలోని నెమళ్లు, పక్షుల సవ్వడులతో.. అలసిన మనసులు సేద దీరుతాయి. హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులు సమీపంలోనే ఉన్న అపూర్వ వనాలను సందర్శించేందుకు అనువుగా ఈ ప్రాంతం అపురూపమైన ప్రాకృతిక ప్రదేశంగా తీరొక్క రీతుల్లో రూపుదిద్దుకొంటున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్. 50 టీఎంసీల సామర్థ్యంతో రూపొందించిన అత్యద్భుతమైన జలాశయమిది. ఇటీవలే ఈ రిజర్వాయర్‌లోకి ప్రాథమికంగా గోదావరి జలాలను విడుదలచేశారు. సిద్దిపేట జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతం అంచున ఈ జలసిరి వెలుస్తున్నది. ప్రాజెక్టు కింద పోను మిగిలిన అటవీ ప్రాంతంలో మల్లన్న వనం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రాంతాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ అటవీ అధికారులను ఆదేశించారు. నల్లమల అడవులను తలదన్నేలా ఈ అటవీప్రాంతం విస్తరించి ఉన్నది. ఇందులో తీరొక్క మొక్కలు, వన్యప్రాణులు, కుంటలు ఉన్నా యి. రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న ఈ అటవీప్రాంతం 4,794.47 హెక్టార్లలో విస్తరిం చింది. ఇందులో 1,327.45 హెక్టార్ల అటవీ ప్రాంతం మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం తో మునిగింది. ఇది పోను 3,467.02 హెక్టార్ల బ్యాలెన్సు అటవీ ప్రాంతాన్నే ‘మల్లన్న వనాలు’గా తీర్చిదిద్దేందుకు అటవీ అధికారులు కృషిచేస్తున్నారు. రాజీవ్ రహదారి పక్కనే ఉం డటం వల్ల హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాం తాల నుంచి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను చూడటానికి ఇప్పటికే పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవిదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించేలా.. దీనిని ఒక మంచి పర్యాటక ప్రాంతంగా, అభయారణ్యం తరహాలో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పక్కా ప్రణాళికతో అధికారులు ముందుకు వెళ్తున్నారు.
దట్టమైన అటవీప్రాంతం కావడంతో వివిధ రకాల జంతువులు అధిక సంఖ్యలోనే ఉన్నాయి. ఇటీవల ఈ ప్రాంతంలో చిరుత సంచరించింది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం నుంచి 20 కి.మీ మేర అటవీ ప్రాంతం గుండా వెళ్తే మల్లన్నసాగర్ రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ ఈ అటవీ ప్రాంతం చుట్టూ అందంగా ఆవరించి కనువిందు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అటవీ పునరుజ్జీవనంలో భాగంగా ఖాళీ భూమిలో వివిధ రకాల మొక్కలను నాటుతున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఈ అటవీ ప్రాంతంలో పెద్దఎత్తున ఆయుర్వేద మొక్కలు పెంచుతున్నారు. అటవీ ప్రాంతం కోతలకు గురికాకుండా ఎక్కడికక్కడ కందకాలు తీసి వాటి గట్లపైన రకరకాల మొక్కలు నాటారు. ప్రధానంగా కలబంద, తులసి, వెదురు, తిప్పతీగ, అల్లనేరడి, పొడపత్రి, ఫామారోజ్‌గడ్డి, నిమ్మగడ్డి తదితర మొక్కలు ఇందులో ఉన్నాయి. అటవీ పునరుద్ధ్దరణలో భాగంగా టేకు మొక్కలు, వేప అడవినాబి తదితర మొక్కలు పెరిగాయి. నాబి మొక్కలు చాలా విలువైనవి. ఈ వనాల్లో ఔషధ మొక్కలు ఎక్కువ సంఖ్యలో ఉండేలా చూస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నా.. వివిధ రకాల మొక్కలు నాటి మల్లన్న వనాలను పెంచుతున్నారు.
రాజీవ్ రహదారి నుంచి 20 కిలోమీటర్లలో..
—————–
సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్లడానికి కొండపాక మండలం లకుడారం గ్రామ శివా రు నుంచి రహదారి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం 1.5 కిలోమీటర్ పొడవునా రహదారి నిర్మాణానికి ఇటీవల నిధులు మంజూరయ్యారు. వివిధ పనుల నిమిత్తం మొత్తం రూ.9 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఎత్తైన ప్రాంతంలో వాచ్‌టవర్లు నిర్మించాలని నిర్ణయించారు. అటవీ, పర్యావరణ పర్యవేక్షణకు, పర్యాటకుల వీక్షణకు ఈ వాచ్‌టవర్లు ఉపయోగపడుతాయి. వాచ్‌టవర్ల నుంచి పర్యాటకులు అటవీప్రాంతం అందాలతోపాటు మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను చూడవచ్చు. రాజీవ్ రహదారిపైన లకుడారం వద్ద ఎంట్రెన్స్ ప్లాజాను ఏర్పాటు చేస్తారు. ఇది ఆకట్టుకునేలా మంచి డిజైన్‌తో తీర్చిదిద్దనున్నారు. వీటితోపాటు టికెట్ కౌంటర్, సెక్యూరిటీ గది, రెస్ట్ రూం తదితరాలు నిర్మించనున్నారు. కొండపాక రిజర్వు ఫారెస్ట్ నుంచి ఆగ్నేయ మూలలో, సిరిసినగండ్ల రిజర్వు ఫారెస్ట్ వాయవ్య మూలలో వేములఘాట్ రిజర్వు వరకు సర్వే చేసి మార్క్‌చేశారు.
అద్భుత సరస్సు అంకారెడ్డి చెరువు
—————-
దట్టమైన అటవీ ప్రాంతంలోని గుట్టల మధ్యన అంకారెడ్డి చెరువు అత్యద్భుతమైన సరస్సులా ఉంటుంది. దీనిలోతు 65 అడుగులకు పైగా ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. అర కిలోమీటర్‌కు పైగా పొడవున్న ఈ చెరువులో ప్రస్తుతం 1.5 టీఎంసీల నుంచి 2 టీఎంసీల మేర నీళ్లు ఉన్నాయని సిద్దిపేట జిల్లా అటవీశాఖ అధికారి శ్రీధర్ తెలిపారు. 3467.02 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంతంలో సుమారుగా 150 వరకు చిన్నచిన్న కుంటలను గుర్తించారు. ఎక్కడి నీళ్లు అక్కడే నిలిచేలా కుంటలను పునరుద్ధరించారు. దీంతో కుంటలన్నీ నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. వేసవిలో అడవి జంతువులు దప్పిక తీర్చుకోవడానికి ఈ కుంటలు ఎంతగానో ఉపయోగపడతాయి. అడవిలో 15 చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. దీంతో భూగర్భ జలాలు వృద్ధి చెందుతున్నాయి. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో చాలావరకు నీటి ఊటలు పెరిగి జాలువారుతున్నాయి. ఈ అటవీప్రాంతంలో ఎన్నోరకాల జంతువులు సంచరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రధానంగా అడవిపందులు, కొండగొర్రెలు, నెమళ్లు, జింకలు, కుందేళ్లు ఇక్కడ ఉన్నాయి. ఇటీవల ఈ ప్రాంతంలో చిరుత కూడా కనిపించింది.
• అటవీ పునరుజ్జీవనంలో భాగంగా వివిధ రకాల మొక్కల పెంపకం • అడవిని దట్టంగా మార్చుతున్న టేకు మొక్కలు, వేప అడవినాబి
• లకుడారం గ్రామ శివారు నుంచి రహదారి నిర్మాణానికి ప్రణాళికలు • 1.5 కిలోమీటర్ పొడవునా రహదారి నిర్మాణానికి ఇటీవల నిధుల మంజూరు • వివిధ పనుల నిమిత్తం మొత్తం రూ.9 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు • మొత్తం అటవీ విస్తీర్ణం 4,794.47
• మల్లన్నసాగర్‌తో ముంపు 1,327.45 • బ్యాలెన్స్ అటవీ ప్రాంతం 3,467.02 • దీనినే మల్లన్న వనం పేరుతో అభివృద్ధి చేస్తున్నారు
• అటవీ ప్రాంతం కోతలకు గురికాకుండా ఎక్కడికక్కడ కందకాలు కందకాల గట్లపై కలబంద, తులసి, వెదురు, తిప్పతీగ, అల్లనేరడి, పొడపత్రి, ఫామారోజ్‌గడ్డి, నిమ్మగడ్డి తదితర మొక్కలు.