‘మంత్రి గారూ! మాట్లాడటం మానేసి తెలంగాణ మాడల్‌ను చూడండి. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల గురించి తెలుసుకోండి. అదే తరహాలో రాష్ట్రంలోని ఉల్లి రైతులను ఆదుకోండి’ అంటూ మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సత్తార్ అబ్దుల్ నబీకి విపక్ష ఎన్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రకాశ్‌దాదా సోలంకే చురకలంటించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం వ్యవసాయంపై జరిగిన చర్చలో బడ్జెట్ కేటాయింపులపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.
ఈ సందర్భంగా మంత్రి సత్తార్ అబ్దుల్ నబీ మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపులను సమర్థించుకున్నారు. గతం కంటే నిధులు పెంచామని, వ్యవసాయం మిగులులో ఉన్నదని వివరించే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రి తీరుపై సోలంకే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మంత్రి గారూ! రాష్ట్రం సర్‌ప్లస్ అవుతున్నది అనే మాటలు ఆపండి. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. కొత్త రాష్ట్రం తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని గమనించండి. రైతులకు ఇవ్వాలనే తపన ఉండాలి.
మంచి చేయాలనే సంకల్పం ఉండాలి. అందుకు తెలంగాణ ఒక ఉదాహరణ. ఆ రాష్ట్రం అభివృద్ధి మాడల్‌ను మహారాష్ట్రలోనూ అమలు చేయండి. తెలంగాణ ప్రభుత్వం అక్కడి రైతులకు ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నది. రైతులు పండించిన ప్రతి గింజనూ అకడి ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. ఎవరైనా రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా అందిస్తున్నది. అది తెలంగాణ మాడల్.
మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వాటిని అమలుచేయవచ్చు. ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్న ఉల్లి రైతులను ఆదుకోవచ్చు. కాకపోతే అందుకు మనసు ఉండాలి’ అని చురకలంటించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే ప్రకాశ్‌దాదా సోలంకేను బీఆర్‌ఎస్ మహారాష్ట్ర కార్యకర్తలు ముద్దుమ్, ప్రణయ్ బుధవారం ప్రత్యేకంగా కలిశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాల పరిశీలనకు తెలంగాణ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులతో మాట్లాడాలని ఆహ్వానించారు.