Pawan Kalyan- Bro movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కింది. బ్రో సినిమా ఈ నెల 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి మెగా వారసులు వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ లు కూడా హాజరయ్యారు.
ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు పలు అంశాల గురించి కూడా మాట్లాడాడు. అలాగే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయాన్నీ కూడా మరోసారి ప్రస్తావించి బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ తేజ్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా కథకి సాయి ధరమ్ తేజ్ రియల్ లైఫ్ కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ మూవీ ఓకే చేసే సమయంలోనే తనకి యాక్సిడెంట్ అయ్యింది. త్రివిక్రమ్ ఇంట్లో ఉండగా నాకు ఫోన్ వచ్చింది. వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాను. చిన్న యాక్సిడెంటే, ఇంకో గంటలో బయటకి వచ్చేస్తాడు అని అనుకున్నాను. కానీ బయటకి రావడం లేదు. నాకు తెలియని ఒక నిస్సహాయత వచ్చేసింది. నాకు చాలా భయం వేసింది. తెలియని నిస్సహాయత ఒక మూలన కూర్చుని మనసులో ఏడ్చాను. వాడికి ఇంకా జీవితం ఉంది వాడిని కాపాడు అని నేను పూజించే దేవతని కోరుకున్నాను. తనని కాపాడిన డాక్టర్స్కి, అంతకంటే ముందు రోడ్డు మీద పడి ఉన్న తనని వెంటనే హాస్పిటల్ కి తరలించిన వ్యక్తికి ఎప్పటికి రుణపడి ఉంటాను. ఈ సినిమా సమయంలో కూడా తేజ్ మాటలు రాక చాలా కష్టపడ్డాడు. దర్శకుడు సముద్రఖని తనని జాగ్రత్తగా చూసుకొని తనతో డైలాగ్స్ చెప్పించారు అని తెలిపారు.
అనంతరం.. తేజ్ నన్ను మెడలో వేసుకునేది అడిగాడు. వాడి కోసం ప్రత్యేకంగా నీతా లుల్లాతో స్పెషల్ గా డిజైన్ చేయించి మరీ తెచ్చాను అని చెప్పి మెడలో వేసుకునే ఓ స్పెషల్ చైన్ ని స్టేజిమీదే తేజ్ కి బహూకరించాడు పవన్. అది ఇచ్చి పండగ చేస్కో అని సరదాగా అన్నారు పవన్. దీంతో అభిమానులంతా అరుపులతో తమ సంతోషాన్ని తెలియచేశారు. ఇక తేజ్ స్టేజి మీదే దాన్ని ధరించాడు. ఆ చైన్ బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ వేసుకుంటాడు. అలాంటిదే తేజ్ అడగడంతో స్పెషల్ గా డిజైన్ చేయించి తన మేనల్లుడి కోసం తెచ్చాడు పవన్.

















