Rains : ఇటీవల ఎడతెరిపిలేని వర్షాలకు ప్రజలంతా ఇబ్బందులకు గురి అవుతున్నారు. అయితే రానున్న నాలుగైదు రోజుల్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. తాజాగా వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం… రాబోయే 24 గంటల్లో ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. అక్టోబర్ 22వ తేదీ నాటికి ఇది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారొచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ మేరకు రానున్న 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ తుఫాన్ కనుక సంభవించి ఆంధ్రా, ఒడిశా సమీపంలో తీరం దాటితే తెలుగు రాష్ట్రాలలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనికి సిత్రాంగ్ అనే పేరు పెట్టనున్నారని సమాచారం అందుతుంది. ఈ మేరకు కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అయితే బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ… అది ఎక్కడ తీరం దాటుతుంది, తీవ్రత ఎంత అనే విషయాలపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో తీరం వెంబడి బలమైన గాలులతో కూడిన వర్షం రావొచ్చని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. కాగా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం తుపాను ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

























