నాగార్జునసాగర్, జూన్ 1 : నాగార్జునసాగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టును బుధవారం నాడు భారతీయ బౌద్ధ మహాసభ ప్రతినిధుల బృందం సందర్శించింది. మే 30 వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించిన పదవ భారతీయ బౌద్ధ మహాసభ సమ్మేళనంలో పాల్గొనటానికి వచ్చిన భారత దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన బౌద్ధ మేధావులు, బౌద్ధ అభిమానులు, బి ఎస్ ఐ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పరంధాములు ఆధ్వర్యంలో బుద్ధ వనాన్ని సందర్శించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ,రాజస్థాన్ ,హర్యానా, ఛత్తీస్గఢ్, ఒరిస్సా , మధ్యప్రదేశ్, బీహార్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి 40 మంది ప్రతినిధులు బుద్ధ వనాన్ని సందర్శించారు. దీనిలో భాగంగా బుద్ధ చరిత వనంలోని బుద్ధుని పాదాలవద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం జాతక పార్క్ , ద్యానవనం , స్థూప వనం, మహాస్తూపాన్ని సందర్శించి మహా స్తూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బుద్ధవనం ప్రపంచ స్థాయిలో బౌద్ధ అభిమానులందరికీ అందుబాటులోకి తేవడంతో పాటు నేటి సమాజానికి అత్యంత అవసరమైన బుద్ధుడు సూచించిన మార్గాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందుతుందని అన్నారు.
వీరందరికి బుద్ధవనం డిజైన్ ఇంచార్జి శ్యామ్ సుందర్ బుద్ధవనం శిల్పాలగురించి ప్రత్యేకంగా వివరించారు. వీరితో పాటు నాగపూర్ బి ఎస్ ఐ జాతీయ అధ్యక్షులు చంద్ర బోది పాటిల్, తెలంగాణ బౌద్ధ మహాసభ ప్రతినిధులు తోకల సంజీవ్ తదితరులు ఉన్నారు.