సాధారణంగా పురాణేతిహాసాల నుండీ ప్రతి కథలోనూ ప్రధానంగా హీరో, విలన్ పాత్రల మధ్యే సంఘర్షణ వుంటుంది. కథను రసవత్తరంగా ముందుకు నడిపే ప్రధానమైన అంశం అదే…! అందుకే, హీరోకి ఎంత ప్రాధాన్యత వుంటుందో, విలన్ కూ అంతే ప్రాధాన్యత వుంటుంది. రావణ సంహారం అంత సులభంగా జరగలేదు. కంసుడి వధ కూడా అంతే. ఆదర్శ పురుషుడిగా రాముడికి ఎంత పేరొచ్చిందో, మహా భక్తుడిగా రావణుడికీ అంత పేరుంది.
ఇక సినిమాల విషయానికొస్తే విలన్ మీద పట్టు సాధించడానికి హీరో కష్టపడాలి. కథ అప్పుడే రసవత్తరంగా సాగుతుంది. ‘శివ’ సినిమాలో హీరో మొట్టమొదటిసారి విలన్ దగ్గరకు వెళుతుంటే ప్రేక్షకులకే భయమేస్తుంది. ఎందుకంటే, హీరో ఓ కాలేజీ స్టూడెంట్. విలన్ అప్పటికే పెద్ద స్థాయిలో ఆరితేరినవాడు. అందుకే, ప్రేక్షకులు నాగార్జున, రఘువరన్ లను కాక శివ, భవానీలను మాత్రమే చూడగలిగారు. హీరో క్యారెక్టరైజేషన్ కి డైరెక్టర్లు ఎంత శ్రద్ధ వహిస్తారో, విలన్ క్యారెక్టరైజేషన్ కీ అంతే శ్రద్ధ వహించడానికి కారణం అదే. అయితే, కొన్ని సినిమాల్లో మాత్రం హీరో పుట్టుకతోనే మంచివాడు, విలన్ పుట్టుకతోనే చెడ్డవాడు అన్నట్టుగా చిత్రీకరిస్తారు. ‘పెళ్లిపుస్తకం’ చిత్రంలో ‘మంచి, చెడు రాసులు పోసి వుండవు…’ అనే ఒక గొప్ప డైలాగ్ వుంది. అలాగే, ‘క్రిమినల్స్ ఆర్ నాట్ బార్న్, దే ఆర్ మేడ్’ అనే వాక్యాన్ని కూడా ఒక చిత్రానికి వాడారు. నిజమే… మంచి, చెడు రాసులు పోసి వుండవు. అలాంటప్పుడు హీరో లక్ష్యం విలన్ ని చంపడం సరికాదు, అతడిలోని చెడుతనాన్ని అంతమొందించడమే లక్ష్యం కావాలి. ‘సర్కారువారి పాట’ చిత్రంలో అదే కనిపిస్తుంది. హీరో సినిమా అంతా కూడా విలన్ ని ‘సర్, మీరు…’ అనే సంబోధిస్తాడు. ఒకే ఒక్కచోట మాత్రం ‘ఆ రెచ్చిపోతావ్ మరి… రెచ్చగొడితే రెచ్చిపోవడానికి నువ్వు చిన్న పిల్లాడివి.’ అంటూ ఏక వచనంతో అంటాడు.
ఇక సినిమా క్లైమాక్స్ లో ‘మిమ్మల్ని కొట్టడమో, పడగొట్టడమో, చంపడమో కాదు నా ఉద్దేశం. అదే అయితే ఇందాక బ్యాంకు దగ్గర పది నిమిషాలు వదిలేసేవాణ్ణి. మీరు మారాలి. మారి మీరు డబ్బు కట్టాలి. మిమ్మల్ని చూసి ఆరు నెలలకో, సంవత్సరానికో ఇంకొకరు, వాళ్లను చూసి ఇంకొకరు కట్టాలి.’ అంటాడు హీరో. ఇకపోతే, ‘సర్కారువారి పాట’ చిత్రంలో వందలు, వేలు, లక్షల కోట్ల రూపాయలను బ్యాంకుల నుండి అప్పు తీసుకుని పెద్దవాళ్లు ఎగ్గొడుతూంటే ఆ భారం కాస్తా సామాన్యుడి మీద ఎలా పడుతోందనేది ప్రధానమైన అంశం. సినిమాను రూపొందించిన లక్ష్యం నెరవేరి పెద్దలంతా బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులను తిరిగి తీర్చేయాలని మనస్పూర్తిగా కోరుకుందాం…!!