ప్రత్యేక కధనం by సీనియర్ జర్నలిస్ట్ ఆది
ఈ రోజు ఉదయాన్నే పేపర్ తెరవగానే రెండు పార్టీల ప్రకటనలు… వాటిలో ఒకటి పీకే గా పిలిపించుకునే ప్రశాంత్ కిషోర్ కి సబంధించినది ఒకటి కాగా.. ఇంకొకటి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు సంబంధించినది.. టీం 7200 పేరిట ఇతడు ఒక సమావేశం ఏర్పాటు చేయడం. ఈ సందర్భంగా… బీజేపీని సైతం వదిలి సొంత కుంపటి పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రకటించడం ఈ వార్త సారాంశం. ఇక ప్రశాంత్ కిషోర్ అయితే ఇటు కాంగ్రెస్ లో పూర్తి స్థాయి కార్యకర్త పోస్టుకు ఇమడలేక అటు తన ఐ ప్యాక్ దందా ఒదులుకోలేక. సతమతమవుతూ తన ప్రత్యక్ష రాజకీయ ఆగమనంపై ఇంత చర్చ జరిగాక ఆ ఫ్లోను ఎందుకు వదులుకోవాలన్న చందంగా.. సొంత పార్టీ పెట్టే దిశగా అడుగు లేస్తున్నట్టు ట్విట్లర్ వేదికగా ఆ ప్రకటన చేయబోతున్నట్టు ఐప్యాక్ వర్గాల సమాచార్.. ఇక మన గులాబీ బాస్ కేసీఆర్ అయితే ఇంట ఎలాగూ గెలిచేసేశాం కాబట్టి.. రచ్చ గెలవడానికంటూ భారత రాష్ట్ర సమితి పేరిట- ఒక పార్టీ ప్రకటన చేయబోతున్నారనీ టాక్ నడుస్తోంది.. తెలంగాణ పొలిటికల్ ఉడ్ లో.. ఒక సమయంలో ఇదే కేసీఆర్- కపిలవాయి దిలీప్ కుమార్ తాను పార్టీ పెడతానని అన్నపుడు పార్టీ అంటే మజాక్ అను కుంటున్నరా? బిల్డింగ్ రెంటు అలా ఉంచండి.. కనీసం కరెంటు ఖర్చులు కూడా తట్టుకోలేరు జాగ్రత్త అన్నారు.. పార్టీ నడుపుడు అంటే.
అదేంత ఉ్టటి ముచ్చట గాదు.. గట్టి గట్టి మహా గట్టి ముచ్చట.. మరి ఈ ముగ్గురిలో వారి వారి స్థాయి శక్తి సామర్ధ్యాలను అనుసరించి కొత్త పార్టీలు పెట్టుట అన్నది సాధ్యమేనా? వీరి వీరి బలా బలాలెంత? అన్నది ఒకసారి చూస్తే…
ఫస్ట్ సీఎం కేసీఆర్ ద బెస్ట్ ఆప్షన్.. ఈయన ఆల్రెడీ ఒక పార్టీని రాష్ట్ర స్థాయిలో పెట్టి.. దాన్నిపుడు వెయ్యికోట్ల నిధులున్న సంస్థగా తీర్చి దిద్దడంతో పాటు రెండు సార్లు రాష్ట్రంలో అధికారం చేపట్టి.. హ్యాట్రిక్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.. ఈ టైంలో ఎలాగూ మనమిక్కడ తోప్ తురుం ఖాన్ లం అయిపోయాం కాబట్టి.. నెక్స్ట్ లెవల్ కి వెళ్లకుంటే పిచ్చ బోరు కొడుతుంది కాబట్టి.. కేసీఆర్ భారతదేశం పార్టీ అన్నది ఒక రీజనబుల్ డెసిషన్.. ఈ మాటను కొట్టి పాడేయటానికి వీల్లేదు.. మోదీ కూడా మూడు సార్లు సీఎం అయ్యాక.. నాలుగో సారి.. పీఎం కుర్చీలో వెళ్లి కూర్చున్నారు.. అయితే ఆయనకు నాగ్ పూర్ బెల్ట్ బ్యాచ్ అండదండగా ఉంది.. కాబట్టి.. ఆ క్యాంపెయిన్ లెవలే వేరే కాబట్టి.. ఒక రేంజ్ లో ఆయన ఒక్కసారి కూడా ఎంపీ కాకుండా నేరుగా వెళ్లి ప్రధాని పీఠాన్ని ఆక్రమించేశారు.. ఇంకా కేసీఆర్ కి అయినా ఎంపీగా, కేంద్రమంత్రిగా కొంత అనుభవం ఉంది.. మోదీ సింగిల్ అటెంప్ట్ లోనే పీఎంగా గెలిచి నిలిచి.. అదుర్స్ అనిపించేశారు.. ఇపుడు కేసీఆర్ అక్కడి వరకూ రావడాన్ని కోరుకుంటున్న వాళ్లెవరు? అన్నది కూడా ఒక చర్చే.. ఎందుకంటే మనమంటూ ఫలానా చోటుకెళ్లాలని కొన్ని వర్గాలు అయినా కోరుకోవాలి ఇక్కడంటే.. కొందరు కరడుగట్టిన గులాబీ కార్యకర్తలుంటారు కాబట్టి సరిపోయింది.. నేషనల్ లెవల్లో ఎందరున్నారు ? అని చూస్తే ఇటీవల రైతు జనబాంధవుడిగా నేషన్ వైడ్ ఒక ఇమేజీ కోసం కేసీఆర్ ట్రై చేసినట్టు కనిపిస్తోంది.. మొన్నటి రైతు ఉద్యమంలో అసువులు బాసిన 750 మంది రైతు కుటుంబాలకు 22. 5 కోట్ల ఎక్స్ గ్రేషియాతో ఈ దిశగా అడుగులు వేశారాయన. ఇదొక ఎత్తుగడ.
ఈ రకంగా దేశ వ్యాప్తంగా రైతు లోకం దృష్టినాకర్షించడం ఒక క్యాంపెయినింగ్ టెక్నిక్ కాదనడం లేదు.. భారతదేశం అంటే రైతు దేశం కాబట్టి..
ఈ దిశగా చేసే ప్రయత్నాలు ఎలాగూ సత్ఫలితాలిస్తాయి కాబట్టి కేసీఆర్ ఈ పని చేసినట్టుగా ఒక అంచనాకు రావచ్చు. ఇక గుజరాత్ మోడల్ కి దీటుగా.. తెలంగాణ మోడల్ ఎలాంటి ఫలితాలను ఇవ్వనుంది? ఇక్కడంత సీనుందా లేదా? గ్రౌండ్ లెవల్ రియాల్టీ ఏంటని చూస్తే.. నిజానికి కేసీఆర్ పరిపాలనకు రైతుల నుంచి మంచి ఫాలోయింగ్ అయితే ఉంది.. ఇక బ్రాండ్ కేటీఆర్ ను ఫాలో అయ్యేవాళ్లను బట్టీ పరిశీలిస్తే.. యూత్ లోనూ పార్టీకి మంచి గ్రిప్పే ఉంది.. ఇక మహిళలకు కేసీఆర్ కిట్టు నుంచి మొదలు పెడితే. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ డబుల్ బెడ్రూం వంటి పథకాలతో మహిళాకర్షణ శక్తి కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి బలంగానే ఉంది.. ఇక పారిశ్రామీకరణ, నగర విస్తరణ వంటి అంశాల్లోకి వెళ్లి పరిశీలిస్తే.. నగర విస్తరణ కోసం 111 జీవో లోని ఆంక్షల రద్దు ద్వారా మరో లక్షా ముప్పై వేల ఎకరాలు అదనంగా సమకూరనుండటం ఒక శుభపరిణామం. అంటే ట్విన్ సిటీని కాస్తా డబుల్ ట్విన్ సిటీగా మార్చే యత్నం అప్పుడే మొదలైందన్నమాట.. అంటే ఓల్డ్ సిటీ నుంచి ఫార్మా సిటీ అటు నుంచి హైటెక్ సిటీ ఇప్పుడు గ్రీన్ సిటీ దిశగా.. హైదరాబాద్ నగరం ముమ్మర వేగంగా విస్తరిస్తుండటం ఖాయంగా కనిపిస్తోంది.. ఇక మిషన కాకతీయ, మిషన్ భగీరథ.. వంటి పథకాలు చెప్పనక్కర్లేదు.. ఇలా గుజరాత్ కన్నా మెరుగ్గానే తమ పాలన ఉన్నట్టు ఒక బలమైన అంచనాలు ఆత్మవిశ్వాసాలు కేసీఆర్ మదిలో ఉన్నట్టు కనిపిస్తున్నాయ్.. మొన్నటి ఆవిర్భావ సదస్సులో ఆయనీ దిశగా చేసిన విశ్వాస ప్రకటనలే ఇందుకు సాక్షి..
ఇక పోతే.. పీకే… పీకేకి ఇప్పటి వరకూ గ్రౌండ్ లెవల్ పొలిటికల్ క్లరికల్ వర్క్ చేసిన అనుభవం ఉన్నమాట కాదనలేం.. పులి సాటి పులిని గెలవడానికి నక్కదగ్గర జిత్తుల మారి పాఠాలు నేర్చుకుంటుందని అంటారు.. పులినే గెలిపించేశాం కదాని నక్క తనకు తాను పులిలా ఫీలై పోయి.. వాతలు పెట్టుకుంటే.. సరిపోతుందా? అంటే ఒక్కమాటలో చెప్పాలంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందం పీకేది..
కాంగ్రెస్ లో ఉంటే ఆయనకుండే నేషనల్ లెవల్ ఇమేజనరీ వేరు- సొంతంగా పార్టీ పెట్టుకుంటే దాని పరిమితులు వేరు.. ఎందుకంటే ఒక బీహారీ అయిన పీకే.. 2011 నాటి నుంచి మోదీలాంటి వారికి సలహా సూచనలిచ్చి.. తర్వాత దీదీ, జగన్, స్టాలిన్ వరకూ ఎందర్నో గెలిపించి..
తిరిగి కాంగ్రెస్ వైపునకు వెళ్లి.. అక్కడ పొసగక.. తర్వాత బెంగాల్లో ఒక ప్రకటన చేసి.. అక్కడితో తర్వాత కాంగ్రెస్ పునరుజ్జీవానికి 600 సూత్రాలని ఒక ప్రెజంటేషన్ ఇచ్చి.. ఆపై వారి నుంచి ఫుల్ టైమర్ ఆహ్వానం అందుకుని.. అటు నుంచి వచ్చిన ఆఫర్ పెద్దగా టెంప్టింగ్ లేక పోవడంతో.. ఇప్పుడు సొంత కుంపటి వరకూ వచ్చింది పీకేస్ పొలిటికల్ జర్నీ.. ఈ జర్నీలో పీకేకి అంటూ ఒక బ్రాండ్ ఇమేజీ వచ్చిన మాట వాస్తవమే.. కాదనడం లేదు.. కానీ ఈ ఇమేజీతో ఆయన గట్టెక్కడం అంటే అదేమంత తేలిక కాదన్న మాట ప్రచారంలో ఉంది.. వాస్తవానికి ప్రత్యక్ష రాజకీయాలు వేరు.. ఎత్తుగడలు వేరు.. స్ట్రాటజిస్టులకు పెద్దగా పాపులారిటీ ఉండదు.. ఎందుకంటే తెలివైన వారిని ఓటర్లు ఏమంత నమ్మరు.. స్ట్రాటజిస్టుల్లోనే అత్యంత ఘనుడైన నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకూ సొంతంగా అఖండ విజయం నమోదు చేయలేక పోవడానికి కారణాలివే.. ఇక్కడ సెంటిమెంటు బాగా పండించగలగాలి.. అదే సమయంలో అయ్యో పాపం అనే ముద్ర కలిగి ఉండాలి.. రాజకీయంగా ఇతడ్ని గానీ ఆమెను గానీ పూర్తిగా నమ్మొచ్చన్న ముద్ర పడాలి.. అలాంటి ముద్రలు ఇలాంటి స్ట్రాటజిస్టులకు పడ్తాయంటే అనుమానమే.. కారణం.. అదంతే.. జయలలిత కు ఎంత బ్యాడ్ ఇమేజీ ఉన్నా.. ఆమెను అర్ధం చేసుకున్నారంటే.. అందులోనే దాగి ఉంటుంది అసలు రాజకీయమంతా.. ఇవాళ పవన్ కళ్యాణ్ తాను రాజకీయ అవినీతి విభాగంలో పూర్తి సచ్చీలుడ్నీ అంటూ ఆయన చేస్తున్న పొలిటికల్ ప్రకటనలను నమ్మి.. ఆయనకంటూ జనం వేస్తున్న ఓట్లు ఏ పాటివో ప్రత్యేకించీ చెప్పనక్కర్లేదు.. ఇందరు అభిమానులున్నా.. జనసేనకు రాలుతోన్న ఓట్ల శాతం చాలా చాలా తక్కువ.. అదే 12 కేసులు, 16 నెలల జైలు జీవితం గడిపి వచ్చి జగన్ కి పడుతున్న ఓట్లు.. వరుస విజయాలు.. ఇందుకు పూర్తి భిన్నమైనవి.. ఇక పీకే కూడా సరిగ్గా ఇలాంటి కోవలోకే వస్తాడు. ఆయనకున్న వైజ్ మేన్ ఇమేజీకి సెంటిమెంటుకూ అస్సలు పొంతన కుదరదంటే కుదరదు.. రాజకీయాల్లో రాణించాలంటే యూపీ సీఎం యోగికి ఉన్నట్టు ఒక వైడ్ ఇమేజీ ఉండాలి.. ఇందులో కులమతాలకు అతీతమైన పేరు ప్రఖ్యాతులుండాలి.. ఇప్పటి వరకూ సింగిల్ వార్డు మెంబర్ గా కూడా గెలవని పీకేకి.. ప్రత్యక్ష రాజకీయాలు బాగా కొత్త.. ఓటర్లు వారి నాడి వారి వారి గుణగణాలు కేరెక్టర్ తెలిసినంత మాత్రాన పనై పోదు.. అది వేరు ఇది వేరు. కాబట్టి పీకే తాను సైతం ఒక మోదీలా మరో కేజ్రీలా ఇంకో మమతా దీదీలా రయ్యిన అధికార పీఠం ఎక్కడం అంతే తేలికగాదు..
ఇక పోతే.. చింత పండు నవీన్.. ఇప్పటి వరకూ మనం చర్చించుకున్న పొలిటికల్ నాన్ పొలిటికల్ పర్సనాల్టీస్ అయిన కేసీఆర్, పీకేలకు ఇతడికీ నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది.. అయితే… అయితే…. అయితే.. రాజ్యాంగం ఇచ్చిన వరం ప్రకారం మాట్లాడితే.. ఒక చాయ్ వాలా ప్రధాని పీఠం ఎలా ఎక్కారో ఒక స్క్రోలింగ్ డెస్క్ లో పని చేసిన సాధారణ జర్నలిస్టు నవీన్ రేపటి రోజున అగ్రపీఠం అధిరోహించడాన్ని ఎవ్వరూ ఆపలేరు.. కానీ అందుకు తగిన సత్తా అతడికుందా? అన్నదే ఇక్కడ ప్రశ్న.. అతడి కులానికి అతడి గోత్రానికీ అతడి మతానికి అతడి ఆత్రానికీ సూటవుతుందా? అన్నదే ఇక్కడ చర్చనీయాంశం.. నిజానికి చింతపండు నవీన్ కి ఎవరు అవునన్నా కాదన్న పెద్ద పాజిటివ్ ఇమేజీ లేదు.. ఇతడిది పూర్తి బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ గా కొట్టి పడేసేవాళ్లున్నారు.. అసలతడి బలమే అది అని బల్లగుద్ది మరీ వాదించేవాళ్లున్నారు..
ఇలాంటి బ్యాడ్ ఇమేజీ తో ఇతడు రాజకీయంగా ఓటర్లలో ఎలాంటి ముద్ర వేయనున్నాడు.. 7200 మంది వెలమ దొరలను పట్టించేస్తా.. వారు చాటు మాటుగా చేస్తున్న దందాలన్నీ బట్టబయలు చేస్తా.. అంటూ ఇతడు తన సమావేశాల్లో చేస్తున్న ప్రకటనలకు అంత దమ్ముందా?
ఆనక ఓటర్లను ఆకర్షించడంలో భాగంగా తన దగ్గర ప్రజలందరికీ ఉచిత విద్య వైద్యం అందించే పథకాలున్నాయనడం వల్లే.. ఓట్లు పడి పోతాయా? అంటే ఇప్పటి వరకూ గవర్నమెంటు స్కూళ్లే లేవా? గవర్నమెంటు ఆస్పత్రులే లేవా? మరి ఇటీవల నగరానికి నాలుగు వైపులా కేసీఆర్ ప్రభుత్వం సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులను కట్టించేందుకు శంఖుస్థాపనలు చేసిందిగా? ఇంతకన్నా మించి నవీన్ తన సొంత పార్టీ అధికారంలోకి రాగానే అందివ్వగలడా? అయినా పీకేకన్నా కేసీఆర్ కన్నా కోట్లాది రూపాయల నిల్వలున్నాయి.. కేసీఆర్ పార్టీకి ఇంతటి ఆర్ధిక శక్తి ఎలా సమకూరిందన్న విషయం అటుంచితే.. పీకే ఒక్క డీల్ కి మూడు వందల నుంచి ఆరు వందల పీజు వసూలు చేస్తాడు.. 2011 నుంచి 2022 వరకూ ఈ పుష్కర కాలంలో మోదీ నుంచి దీదీ వరకూ జగన్, స్టాలిన్, కేసీఆర్ ను కలుపుకుని చూస్తే ఏ వెయ్యి కోట్ల రూపాయలకు పైగానో వసూళ్లు చేసి ఉంటాడు.. అదీ పీకే స్ట్రెంగ్త్.. అలాంటి పీకే తో పోల్చుకుంటే నీవీన్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా చేసే పొలిటికల్ దందాలతో ఎంత మొత్తం వెనకేసి ఉంటాడు.. ఐదు కోట్లు- పది కోట్లు- వంద కోట్లు- పోనీ ఓ ఐదొందల కోట్ల వరకూ వసూలు చేసుంటాడా? కేసీఆర్ ను కూడా కొందరిలాగే అడిగితే.. మన పార్టీకంటూ డైహార్డ్ ఫ్యాన్స్ అంటే కార్యకర్తల బలం అరవై లక్షల వరకూ ఉందనీ.. వీళ్లలో కొందరు మహా రాజ పోషకులున్నారనీ.. అంటారు.. మరి వెలమదొరల్లో అంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, కోటాను కోట్ల ఆస్తులు గల బిగ్ షాట్స్ ఉండొచ్చు గాక.. నవీన్ సామాజిక వర్గంలో అంతటి తోపులున్నారా? అంటే అనుమానమే.. నవీన్ బలమంతా తాను చేసే బ్లాక్ మెయిల్ దందా తప్ప.. మరొకటి లేదన్న మాట వినిపిస్తుంది.. అతడి గురించి బాగా తెలసిన వారి నోటి వెంట.. ఈ క్రమంలో నవీన్ లాంటి సామాన్యుడు ఇంత పెద్ద కాస్ట్ లీ మేనేజ్మెంట్ కిందకు వచ్చే పార్టీ పెట్టుట అది అధికార పీఠం అధిరోహించుటా.. అయ్యే పనేనా అని? ఏది ఏమైనా ఒక కేసీఆర్- ఒక పీకే- మరో నవీన్.. వీళ్ల కొంగొత్త ఎత్తుగడలు ఆలోచింప చేస్తున్నాయ్.. వీళ్లేంటి వీళ్ల బలాబలాలేంటన్న చర్చకు తెరలేపుతున్నాయ్… మరి చూడాలి.. తర్వాత ఏం జరగనుందో కేసీఆర్, పీకేలు 2024 నాటికి తమ తమ పార్టీల ప్రకటనలు చేస్తారా? నవీన్ 2023 నాటికి రాష్ట్రంలో కొత్త పార్టీకి పురుడు పోస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ!!! ప్రత్యేక కధనం by సీనియర్ జర్నలిస్ట్ ఆది