బీజేపీలో ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా పేలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ నిలువునా చీలిపోతున్నది. వాస్తవానికి బండి సంజయ్‌పై మొదటి నుంచి పార్టీలో వ్యతిరేకత ఉన్నది.
పట్టుమని నలుగురు నాయకులు లేరు.. ఎన్నికలు జరిగితే 10 శాతం ఓట్లు కూడా రావు.. ముగ్గురు ఎమ్మెల్యేలు.. ముగ్గురూ మూడు దిక్కులు.. రేపటి అధికారం దేవుడెరుగు, ఉన్నోళ్లకు డిపాజిట్లు దక్కుతాయా అన్నట్టున్న పరిస్థితి. అయినా అధికారం కోసం పోరాటం, కీర్తి దాహం. పదవుల గురించి తప్ప ప్రజా సమస్యల గురించి పట్టింపు లేదు. అహంభావాలు తప్ప రాష్ట్రం గురించి ఆరాటం లేదు. ప్రజలు గుర్తుపట్టగలిగే నేతలు ఉన్నది నలుగురు.. కానీ 40 గ్రూపులు. ఇదీ బీజేపీ పరిస్థితి. పెద్దగా క్యాడర్ లేని పార్టీనే సక్కగా నడపలేనివారికి రాష్ర్టాన్ని పాలించే అర్హత ఉంటుందా? అధికారం దొరికితే రాష్ర్టాన్ని కుక్కలు చింపిన విస్తరిని చేయరా? అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
బీజేపీలో ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా పేలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ నిలువునా చీలిపోతున్నది. వాస్తవానికి బండి సంజయ్‌పై మొదటి నుంచి పార్టీలో వ్యతిరేకత ఉన్నది. రాష్ట్రంలో బీజేపీకి కాస్త హైప్ తెచ్చారన్న ఒకే ఒక కారణంతో ఢిల్లీ పెద్దలు ఆయనకు అండగా నిలుస్తున్నారు. అయితే పార్టీలో ఆయన ఆధిపత్య ధోరణి, లెక్కలేనితనం, గ్రూపులు కట్టడం నానాటికి పెరిగిపోతుండటంతో కీలక నేతలంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. తాజాగా.. ఎమ్మెల్సీ కవితపై బండి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అసమ్మతి వర్గం భగ్గుమన్నది. నోరు తెరిస్తే ధర్మం అని చెప్పుకొనే పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బండి కోటకు బీటలు వారడం మొదలైంది. అసంతృప్తి జ్వాలకు ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆజ్యం పోయగా.. సీనియర్ నాయకుడు పేరాల చంద్రశేఖర్ ఏకంగా బండిపై జంగ్ సైరన్ మోగించారు. దీంతో కార్యకర్తలు మొదలు రాష్ట్రస్థాయి నేతల వరకు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో బండి తన అనుకూల వర్గంతో వ్యతిరేక వర్గంపై కామెంట్లు చేయిస్తున్నారు.
అధ్యక్షుడు కోఆర్డినేటర్ మాత్రమే
‘జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే పవర్ సెంటర్ కాదు. కో ఆర్డినేషన్ సెంటర్ మాత్రమే’ అని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆదివారం ఢిల్లీలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇది బీజేపీలో బండి సంజయ్ నాయకత్వంపై భగ్గుమంటున్న అసంతృప్తికి నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఇటీవల బండి సంజయ్ అధ్యక్ష పదవీకాలం ముగియటంతో ఆ పదవి కోసం ధర్మపురి అర్వింద్, కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు వంటివారు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే మళ్లీ బండికే అవకాశం దక్కడంతో వారంతా తీవ్ర అసంతృప్తితో రగులుతున్నట్టు పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు. అందుకే కొన్నాళ్లుగా అరవింద్, రాజేందర్ సైలెంట్ అయ్యారని, అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవితపై బండి వ్యాఖ్యలను ఆసరాగా చేసుకొని అర్వింద్ బాణాలు ఎక్కుపెట్టారు. ‘ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించను. ఆయన సంజాయిషీ ఇచ్చుకోవాలి. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొంటే మంచిది’ అని స్పష్టం చేశారు. ‘ఆ వ్యాఖ్యలకు బీజేపీకి సంబంధం ఉన్నదని నేను ఒప్పుకోను’ అంటూ పార్టీతో సంబంధం లేదని తేల్చేశారు. సామెతను మాత్రమే వాడారని బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని సైతం అర్వింద్ ఖండించారు. ‘తెలంగాణలో మస్తు సామెతలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా వాడాలి’ అని హితవు పలికారు.
అధిష్ఠానానికి ఫిర్యాదు
అరవింద్ ప్రెస్‌మీట్‌తో వదిలిపెట్టకుండా ఈ వ్యవహారాన్ని చిలికిచిలికి గాలివానలా మార్చాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది. వాస్తవానికి ఎమ్మెల్సీ కవితపై ధర్మపురి అర్వింద్ అనేక సార్లు అనుచిత వ్యాఖ్యలు, ఘాటు విమర్శలు చేశారు. అయినా కేవలం బండి సంజయ్‌ని ఇరికించేందుకే ఇలా ప్రెస్‌మీట్ పెట్టి మరీ తన అసంతృప్తిని వెళ్లగక్కారని సన్నిహితులు పేర్కొంటున్నారు. అక్కడితో ఆగకుండా బండి సంజయ్‌పై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
మాఫియా స్టెల్‌లో
బండి సంజయ్‌పై తాజాగా బీజేపీ సీనియర్ నేత పేరాల చంద్రశేఖర్‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కారణంగా బీజేపీలో సెటిల్మెంట్లు, దందాలు, అవినీతి, బ్లాక్‌మెయిల్ మొదలయ్యాయని సోషల్ మీడియాలో ఆరోపించారు. ధర్మపురి అరవింద్ మాట్లాడింది వంద శాతం వాస్తవమని.. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ వంటి పెద్దలు చేయాల్సిన పనిని ఆయన చేశారని చెప్పారు. ‘అధ్యక్షుడి పరిణతి లేని అసందర్భ మాటలు, వ్యవహారం, నియంతృత్వం, అప్రజాస్వామిక చేష్టలు బీజేపీలో ఈ పరిస్థితికి కారణం’ అని మండిపడ్డారు. అంతేకాదు.. బండి సంజయ్ బ్లాక్‌మెయిళ్లకు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘కరీంనగర్ గ్రానైట్స్‌లో అవినీతిని లేవదీసి అంతర్గతంగా ఒప్పందాలు చేసుకోవడం, రాజ్ న్యూస్‌లో జూపల్లి రామేశ్వర్‌రావు మైనింగ్ అక్రమాలంటూ సిరీస్‌లు ఇచ్చి తర్వాత సెటిల్మెంట్ చేసుకోవడం, రాజ్ న్యూస్‌లో నలుగురు ముఖ్య బీజేపీ నాయకులతో కోట్లు పెట్టుబడి పెట్టించి నట్టేట ముంచివేయడం, దశాబ్దాలుగా పనిచేస్తున్న నాయకులను పకనబెట్టి సికింద్రాబాద్ కంటోన్మెంట్ వీసీ పోస్ట్‌ను ఆర్థిక కారణాల వల్ల కొత్తవారికి ధారాదత్తం చేయటం’ వంటివి జరిగాయంటూ పోస్ట్‌లో పేరాల పేర్కొన్నారు.
వాళ్ల పద్ధతి మాఫియా ైస్టెల్‌లో ఉన్నదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘మసీదుల తవ్వకాలు, బ్లాక్‌మెయిల్, అంశాలను లేవదీసి అంతర్గతంగా సెటిల్మెంట్లు, సుదీర్ఘ కాలంగా ఉన్న కార్యకర్తలకు అవమానం, ఒంటెత్తు పోకడలు, సమన్వయ లోపం, వ్యక్తిగత ఆర్థిక స్వార్థం, యూజ్ అండ్ త్రోలు బీజేపీ సంసృతి కాదు. అయినా యథేచ్చగా నడుస్తున్నాయి’ అని వాపోయారు. వీటన్నింటినీ ఉదాహరణలతో సహా నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
అనుకూల వర్గాల కామెంట్లు
విమర్శలు ఎక్కుపెట్టిన ధర్మపురి అర్వింద్, పేరాల చంద్రశేఖర్‌పై బండి వర్గీయులు ఎదురుదాడి మొదలుపెట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్ బండికి మద్దతు పలికారు. అర్వింద్ మీడియా ముందు ఇలా మాట్లాడటం తప్పు అని వ్యాఖ్యానించారు. ఇక సోషల్ మీడియాలో రెండు వర్గాలతో భారీగా ట్రోలింగ్ జరుగుతున్నది. బండి వర్గం కామెంట్ చేస్తే.. అరవింద్ వర్గం అదేస్థాయిలో బదులిస్తున్నది. అర్వింద్ మాట్లాడింది ‘సీదీ బాత్ నో బక్వాస్’ అని ఒకరు అంటే.. దీనికి కౌంటర్‌గా ‘ఎదురించేటోడు వచ్చినప్పుడు బెదిరించి బతికేటోడు అభద్రతాభావంతో ఎన్ని రకాల కథలైనా పడి అడ్డుతొలగించుకోవాలని చూస్తడు. ఎక్కడా దొరకకపోతే కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు చేస్తడు. ఇది వాని పిరికి తనానికి సూచన’ అంటూ బండి వర్గం కామెంట్ చేస్తున్నది.
‘బండి’కి రాష్ట్ర మహిళా కమిషన్ తాఖీదులు
రేపు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. బండిసంజయ్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యాప్తంగా మహిళాలోకం ఆందోళనలు, నిరసనలు తెలుపడంతో ఆయన వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్నది. ఈ నేపథ్యంలో సోమవారం బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్.. బుధవారం వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. మరోవైపు బండి సంజయ్ వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని కూడా ఆదేశించింది. బండి సంజయ్ వ్యక్తిగతంగా మహిళా కమిషన్ ఎదుట హాజరుకాకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. ఇప్పటికే కొందరు జాగృతి, బీఆర్‌ఎస్ నాయకులు బండి సంజయ్‌పై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయగా.. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.