రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ విభాగపు అధికారులతో కమిషనర్ డి ఎస్ చౌహాన్ ఐపీఎస్ నేరెడ్మెట్ లోని కమీషనర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
శాంతి భద్రతల పరిరక్షణలో ట్రాఫిక్ విభాగం యొక్క ప్రాధాన్యతను కమిషనర్ సిబ్బందికి వివరించారు. పట్టణాలు, నగరాల్లో సామాన్య ప్రజలకు ఎక్కువగా కనిపించేది, అందుబాటులో ఉంటూ తక్షణమే స్పందించే అవకాశం ఉండేది ట్రాఫిక్ పోలీసులకే అని కమిషనర్ తెలిపారు. సివిల్ పోలీసులతో సమన్వయంతో పనిచేస్తూ, నేర నియంత్రణకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎండా వానలలో, చలిలో సైతం రోడ్ల మీద విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసుల వల్లే నగరాల్లో ఎన్నో నేరాలు, రోడ్డు ప్రమాదాలు అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు. తీవ్రమైన వాయు కాలుష్యాన్ని సైతం లెక్కచేయకుండా, తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారని కమిషనర్ అభినందించారు. యూ టర్న్ ల వద్ద, పలు జంక్షన్ల వద్ద అమలు చేసిన కొత్త విధానాల వల్ల రాచకొండ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుముఖం పట్టాయని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు.
రోడ్డు ప్రమాదాల సమయంలో ట్రాఫిక్ సిబ్బంది వీలైనంత త్వరగా స్పందించి క్షత గాత్రులకు సహాయం చేయాలని, ట్రాఫిక్ సిబ్బంది అందరూ ప్రథమ చికిత్స శిక్షణ పొందాలని సూచించారు. సాధారణ ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎండా కాలం రానున్నది కాబట్టి సిబ్బంది అందరూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.
ఈ సమావేశంలో రాచకొండ జాయింట్ కమిషనర్ సత్యనారాయణ ఐపీఎస్, డీసీపీ ట్రాఫిక్ అభిషేక్ మొహంతి ఐపీఎస్, డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్, డీసీపీ రోడ్ సేఫ్టీ శ్రీ బాల దేవి, ఏసిపిలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.