సాధారణంగా ఒక ఫ్లైట్ టైముకి బయల్దేరలేదంతే ఏవైనా టెక్నికల్ రీజన్స్ వుండి వుండాలి. లేదా, వాతావరణం అనుకూలించకపోయి వుండాలి. కానీ, ఒక ప్యాసింజర్ తన సెల్ ఫోన్లో చేసిన చాటింగ్ విమానాన్ని ఆరు గంటలపాటు ఆపేసిందంటే నమ్మగలరా? కానీ, ఇది నిజంగా నిజం. కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో జరిగిందీ ఘటన.
వివరాల్లోకి వెళితే, మంగళూరు నుంచి ముంబై వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్‌కు రెడీ అయింది. ప్రయాణీకులు సీటు బెల్టులు ధరించి సిద్ధంగా వున్నారు. అంతలో ఒక ప్యాసింజర్ తన స్నేహితురాలితో సెల్ ఫోన్లో చేస్తున్న చాటింగ్ ని పక్కనే వున్న ప్యాసింజర్ పొరపాటున చూశారు. అతడు ‘యూ ఆర్ ద బాంబర్…’ అని చాటింగ్ చేయడం చూసిన ఆ పక్కనున్న ప్యాసింజర్ కి ఏదో అనుమానం కలిగి విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్లు కాస్తా ఈ విషయాన్ని పైలట్ కి చెప్పారు. దీంతో ఫ్లైట్ లో ప్రయాణానికి సిద్ధమైన 185 మందినీ కిందకు దించేసి విమానమంతా వెదికారు. బాంబు లాంటిదేమీ లేకపోవడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
ఇంతకీ, అసలు విషయమేంటంటే అదే విమానాశ్రయంలో బెంగళూరుకి వెళ్లాల్సిన విమానం కోసం ఎదురు చూస్తున్న తన స్నేహితురాలితో ఆ కుర్రాడు అలా సరదాగా చాటింగ్ చేశాట్ట…!!
పోలీసులు ఇటు ఈ కుర్రోడినీ, అటు ఆ కుర్రదాన్నీ అదుపులోకి తీసుకుని కొన్ని గంటలపాటు విచారించారుట…! అది సరదాగా సాగిన సంభాషణే అని తేలినప్పటికీ అక్కడ అమ్మాయినీ, ఇక్కడ అబ్బాయినీ విమానాల్లోకి అనుమతించలేదు. మొత్తానికి ఇద్దరూ కొంప ముంచిన సరదా సంభాషణవల్ల ఫ్లైట్స్ మిస్సయ్యారు. ఆ కుర్రాడు ప్రయాణించాల్సిన ఫ్లైట్ ఆరు గంటల తరువాత సాయంత్రం ఐదు గంటలకు బయల్దేరింది. సో, బాయ్స్ అండ్ గాళ్స్… ఫ్లైట్ లో కూర్చున్న తరువాత ఎవ్వరితోనూ, ఎలాంటి చాటింగులూ చేయకండి. చేస్తే ఇదిగో… ఇలాగే కొంప మునుగుతుంది.


























