సాధారణంగా ఏ సినిమా అయినా సూపర్ డూపర్ హిట్ కావాలనీ, ఎక్కువమంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి బ్రహ్మరథం పట్టాలనీ ప్రతి చిత్రబృందం కోరుకుంటుంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి సినిమా హిట్టైతే ఆ చిత్రబృందం సంబరాలు జరుపుకుంటుంది.
అయితే, ఇటీవలే విడుదలై అందరి ప్రశంషలను పొందిన ‘సీతారామం’ చిత్ర బృందానికి మాత్రం అంతకు మించిన ఆనందం దక్కింది. అదేంటంటే, ఉప రాష్ట్ర పదవికి ఇటీవలే రాజీనామా చేసిన ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ చిత్రాన్ని చూడ్డమే గాక, చిత్రాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు కూడా. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే…!!
‘సీతారామం’ సినిమాను వీక్షించాననీ, చాలాకాలం తర్వాత ఒక చక్కని సినిమాను చూసిన అనుభూతి కలిగిందనీ ఆయన అన్నారు. రణగొణ ధ్వనులు లేకుండా, కళ్లకు హాయిగా ఉండే ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాత అశ్వనీదత్, స్వప్న మూవీ మేకర్స్ సహా చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నానని వెంకయ్యనాయుడు చెప్పారు. నటీనటుల అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమైందని కొనియాడారు. సాధారణ ప్రేమకథలా కాకుండా, దానికి వీర సైనికుడి నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ చూడదగినదని చెప్పారు.


























