‘యత్ర నార్యస్తు పూజ్యంతే…’ అంటూ పూజింపబడాల్సిన నేలమీద నిత్యం స్త్రీ ఎన్నో అవమానాలను ఎదుర్కొంటోంది. వయసు తారతమ్యం లేకండా స్త్రీ అంటూ కనబడితే చాలు కామం నిండిన కళ్లతో చూడడం, వీలైతే అసభ్యంగా ప్రవర్తించడం, ఇంకా కుదిరితే గనక మానభంగం చేసి ప్రాణం తీయడం కొందరు మగాళ్లకు అడ్డూ అదుపూ లేని అలవాటుగా మారింది. దీన్ని తెగింపు అనాలా, క్షణికావేశం అనాలా అర్థంగాని పరిస్థితి నెలకొంటోంది.
అయితే, ఓ ఆకతాయి తనను ‘ఐటెమ్’ అనడమేగాక, జుట్టుపట్టి లాగి అసభ్యకరమైన రీతిలో వేధించినందుకు ధైర్యంగా ముందడుగు వేసి కేసు పెట్టింది. ముంబైలో ఈ సంఘటన 2015వ సంవత్సరం జులై 14వ తేదీన జరిగింది. ఓ పదహారఏళ్ల బాలిక స్కూలు నుండి ఇంటికి వెళుతుండగా బైకుపై వెంబడించిన పాతికేళ్ల ఆకతాయి కుర్రాడు ‘క్యా ఐటెమ్ కిదర్ జా రహీ హో’ (ఏం ఐటెమ్.. ఎక్కడికెళ్తున్నావ్?) అని వేధించడమే గాక, జుట్టు పట్టి వేధించాడని ఆరోపించింది. విచారణ చేపట్టిన పోక్సో కోర్టు, అమ్మాయిలను లైంగికంగా వేధించేందుకు అబ్బాయిలు ఉద్దేశపూర్వకంగానే అలా పిలుస్తారని పేర్కొంది. ఇలాంటి రోడ్సైడ్ రోమియోలకు బుద్ధి చెప్పాల్సిందేనని వ్యాఖ్యానించింది. నిందితుడి విషయంలో కనికరం చూపించే ప్రసక్తే లేదని పేర్కొంటూ ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది.
ఈ సంఘటన గురించి విన్న తర్వాత ఇలాంటి పోకిరీ కుర్రాళ్లకు బుద్ధొస్తుందా, లేదా అన్న విషయాన్ని పక్కనబెడితే కనీసం ఆ కుర్రాడికైనా బుద్ధొస్తే అంతే చాలు…!! మనం 2022లో వున్నాం, చాలాకాలంగా స్త్రీలను గౌరవించాలీ, పూజించాలీ అనే పాఠాలు చదువుకుంటూనే వున్నాం. కానీ, మహిళలపై అఘాయిత్యాలు మాత్రం తగ్గడం లేదు. ఇకనైనా ప్రపంచం ఈ విషయంలో మారాలని కోరుకుందాం…!!