ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ పిల్లవాడిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా… ఇలాంటి ఘటనల్లో ఎవరికైనా నాలుగు, ఐదు కుట్లు పడ్డాయంటేనే తీవ్రంగా గాయపరిచిన ట్లు…. అలాంటిది ఈ ఘటనలో బాలుడికి ఏకంగా 200 కుట్లు పడ్డాయంటేనే ఏ తీరుగా గాయపరిచిందో అర్థం చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 03న ఘజియాబాద్‌లోని తన ఇంటి సమీపంలోని ఓ పార్కులో ఆడుకునేందుకు వెళ్లిన 11 ఏళ్ల పుష్ప్ అనే బాలుడిపై… ఓ బాలిక తీసుకువచ్చిన కుక్క విరుచుకు పడింది. బాలిక నుంచి తప్పించుకుని వచ్చి ఒక్కసారిగా బాలుడిపై ఇష్టారాజ్యాంగా గాయపరిచింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి పరుగుల వచ్చి…. పిల్లవాడిని రక్షించాడు. అప్పటికే… పుష్ప్ త్యాగి ముఖంలోని కొంత భాగాన్ని కుక్క కొరికేసినట్లు స్థానికులు వెల్లడించారు. ఆసుపత్రికి తరలించిన పుష్ప్ మొహానికి వైద్యులు 200 కుట్లు వేసి… కట్లు కట్టారు. ఈ మొత్తం ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ అధికారులు… కుక్క యజమానిపై చర్యలకు ఉపక్రమించారు. ఎలాంటి లైసెన్స్ /రిజిస్ట్రేషన్ లేకుండా కుక్కను పెంచుతున్నందుకు రూ. 5 వేల జరిమానా విధించారు. దాంతో పాటే ఇతర చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దాడి చేసిన కుక్క పిట్ బుల్ జాతికి చెందినదిగా చెబుతున్నారు. ఈ జాతి కుక్కలు ఇటీవల యజమానుల్ని, ఇతరుల్ని తీవ్రంగా గాయపరుస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ ఘటన తర్వాత స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఆడుకునే పార్క్‌కు జంతువులను తీసుకురావడం సరికాదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. యూపీలో పెంపుడు కుక్కల దాడి ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి.
కొద్ది రోజుల క్రితమే… పెంపుడు కుక్కల దాడికి సంబంధించిన రెండు దిగ్భ్రాంతికరమైన సంఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలోనే అలాంటి ఘటనే చోటుచేసుకోవడం… స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.