సాధారణంగా మనకు నగదు కావాలంటే ఎ.టి.ఎం.కి వెళ్లి తీసుకుంటాం. ఎ.టి.ఎం.ల నుండి డబ్బు మాత్రమేనా? అని కొశ్చన్ చేస్తే కాకపోతే ఇంకేం వస్తాయ్ మరి? అని కోప్పడకండి. నిజంగానే ఇప్పుడు ఎ.టి.ఎం.కి వెళ్లి ఎంచక్కా వేడి వేడి ఇడ్లీలనూ తీసుకోవచ్చు. వ్యాపారవేత్తలైన శరణ్ హిరేమత్, సురేశ్ చంద్ర శేఖరన్ లకు ఈ వినూత్నమైన ఆలోచన తట్టింది.
బెంగళూరులో ఈ వినూత్నమైన ఆలోచనకు కార్యరూపాన్నిచ్చారు ఆ వ్యాపారవేత్తలు. ఫ్రెషట్ రోబోటిక్ అనే స్టార్టప్ సన్స్థ ఈ ఇడ్లీ తయారీ యంత్రాన్ని రూపొందించింది. ఇది కేవలం 12 నిమిషాల్లో 72 ఇడ్లీలను సిద్ధం చేసి వేడి వేడిగా అందించగలదు. 24 గంటలూ అందుబాటులో వుండే ఈ ఇడ్లీ ఎ.టి.ఎం. ఆలోచన ఎలా వచ్చిందో వివరిస్తూ ‘2016లో మా అమ్మాయి అనారోగ్యంగా వున్నప్పుడు అర్థరాత్రి ఇడ్లీలు దొరక్క ఇబ్బందులు పడ్డాం. ఆ పరిస్థితి నుండే ఈ ఆలోచన పుట్టుకొచ్చింది.’ అని చెప్పారు శరణ్ హిరేమత్.
ఈ ఇడ్లీ ఎ.టి.ఎం. నుండి ఇడ్లీలను పొందడం చాలా సులువు. ఎలాగంటే, మెషీన్ కి వున్న క్యు.ఆర్. కోడ్ ని స్కాన్ చేస్తే మెనూ వస్తుంది. అందులో ఇడ్లీలను సెలెక్ట్ చేసుకుని ఆన్ లైన్ లో డబ్బు చెల్లిస్తే చాలు, నిమిషం లోపునే కారప్పొడి, చట్నీలతో సహా వేడి వేడి ఇడ్లీలు చేతికొచ్చేస్తాయి. అయితే, ఈ ఇడ్లీ ఎ.టి.ఎం.కి ప్రజల నుండి చక్కని ఆదరణ లభిస్తోంది. ఈ ఉత్సాహంతో ఈ వ్యాపారవేత్తలు వీలైనన్ని ఎక్కువ ప్రాంతాలకు విస్తృతం చేస్తారేమోననిపిస్తోంది గదూ…!!


























