Movie జీవిత లక్ష్యం గురించి చెప్పమంటే ఎవరైనా ‘ఉన్నత స్థాయికి ఎదగాలి’, ‘బాగా సంపాదించాలి’, ‘మంచి గుర్తింపు పొందాలి’ అని అంటుంటారు. కానీ కృష్ణంరాజు మాత్రం ఇందుకు భిన్నం. ‘నేనెవరికీ అన్యాయం చేయలేదని గుండె మీద చేయి వేసుకుని కన్నుమూయాలి’ అని చెప్పారాయన. అవును, ఈ మాటలు స్వయంగా కృష్ణంరాజు చెప్పినవే. తానెలా చనిపోవాలనుకుంటున్నారో సుమారు 16 ఏళ్ల క్రితమే ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
“ప్రతి మనిషికీ ఓ జీవిత లక్ష్యం ఉండాలంటారు. దీని గురించి నాగార్జున ఫెర్టిలైజర్స్ కేవీకే రాజుగారికీ, నాకు మధ్య ఓసారి ఆసక్తికర చర్చ సాగింది. అప్పుడు నేను చెప్పిన మాటలివీ.. ‘‘పచ్చని చెట్టు నీడలో కూర్చొని.. నా జీవితంలో నేను ఎవరికీ అన్యాయం చేయలేదని.. గుండెల మీద చేతులు వేసుకుని.. నిర్మలమైన ఆకాశం వంక చూస్తూ తుదిశ్వాస విడవాలి. జీవితంలో ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు అనే ఆనందంతో చనిపోవడం కన్నా సంతోషం ఏముందని.. రోజూ, ఈరోజూ.. అదే నా కోరిక” అని కృష్ణంరాజు చెప్పారు.
కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3.25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆదివారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు రావడం వల్ల కృష్ణంరాజు కన్నుమూశారు. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ప్రయాణించిన ఆయన మరణంతో చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది. సోమవారం హైదరాబాద్లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు చెప్పారు.

























