Crime మావోయిస్ట్ పార్టీకి చెందిన కీలక రాష్ట్ర స్థాయి నాయకుడు…దామోదర్ భార్య మడకం కోసి అలియాస్ రజిత పార్టీలో కీలకంగా వ్యవహరిస్తుంది.
ఈమె చర్ల లోకల్ గెరిల్లా స్క్వాడ్ కమాండర్ విధులు నిర్వహిస్తోంది. ఇంతటి కీలక వ్యక్తిని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో కమాండర్ రజితతో పాటు మరో అయిదుగురు సభ్యుల బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇంత వరకు పోలీసు వర్గాలు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంతో…. వీరందరినీ ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉందని మావోయిస్ట్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసుల అదుపులోని మావోయిస్ట్లకు ఎలాంటి హాని తలపెట్టకుండా న్యాయస్థానంలో హాజరుపర్చాలంటూ….. మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ కోరారు. బుధవారం ఈ మేరకు ఆయన మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు.
ఛత్తీస్గఢ్-తెలంగాణ పోలీసులు బుధవారం తెల్లవారుజామున మూకుమ్మడిగా డోకుపాడు, కుర్నపల్లి, కొండెవాయి గ్రామాలపై దాడి చేశారని లేఖలో పేర్కొన్న ఆజాద్…. అనారోగ్యంతో ఉన్న రజిత, దనితో పాటు నలుగురు దళ సభ్యులను పోలీసు బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు ఆరోపించారు. వీరందరినీ బూటకపు ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ఆయన…. వారికేమైనా ప్రమాదం తలెత్తితే… అందుకు పోలీసులు, ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తమ కుమార్తె పోలీసుల అదుపులో ఉందన్న విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న రజిత తల్లిదండ్రులు మారయ్య, పోచమ్మ బుధవారం రాత్రి వారి స్వగ్రామమైన దుమ్ముగూడెం నుంచి భద్రాచలం వచ్చారు. పోలీసులు తమ కుమార్తె అరెస్టును చూపించి కోర్టులో ప్రవేశపెట్టాలని, ఎలాంటి హాని చేయకూడదని వారు కోరారు.