Rajanikanth in Bengaluru bus depot : ఓ సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్‌గా ఎదిగాడు రజినీకాంత్ . ఆయన జీవితం ఎందరికో స్పూర్తి. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే.. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం ఆయన వల్లే సాధ్యం. తాజాగా ఆయన తాను పనిచేసిన బస్ డిపోకు వెళ్లాడు. అక్కడి వారందరితో సరదాగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మంగళవారం ఉదయం రజినీకాంత్ దక్షిణ బెంగళూరులోని జయనగర్ ప్రాంతంలోని బీఎంటీసీ డిపోకు వెళ్లారు. ఆయన వస్తున్నట్లు అక్కడి సిబ్బందికి గానీ.. అధికారులకు గానీ ఎలాంటి సమాచారం లేదు. దీంతో రజినీకాంత్‌ను చూసిన వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైయ్యారు. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర అధికారులతో తలైవా కాసేపు ముచ్చటించారు. వారందరితో సెల్ఫీలు దిగారు. ఇక రజినీకాంత్ వచ్చారని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో డిపో వద్దకు వచ్చారు.
బస్ డిపోలో సూపర్ స్టార్ ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీన్ని చూసిన నెటీజన్లు.. అసలైన సూపర్ స్టార్ రజినీకాంతే అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఇటీవల రజినీకాంత్ నటించిన సినిమా జైలర్ . నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. సూపర్ స్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. జై భీమ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు టీజే జ్ఞానవేల్ డైరెక్షన్‌లో రజినీకాంత్ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.