Crime డబ్బుంటేనే సంతోషం ఉంటుందని, లగ్జరీగా జీవించొచ్చని కొందరు భావిస్తుంటారు. ఆ సంతోషాన్ని వెతుక్కుంటూ అడ్డదారులు తొక్కుతారు. కానీ ఇలాంటి ఎన్ని చేసినా.. అంతిమంగా అధర్మంగా సంపాదించిన ధనం సుఖాన్ని కాదు దుఖాఃన్నే మిగులుస్తుంది. ఇందుకు నిదర్శనమే షేక్‌పేట మాజీ తహసీల్దార్ సుజాత కుటుంబం. అక్రమ సంపాదన పచ్చని కుటుంబాన్ని కబలించింది. ఓ అవినీతి కేసులో దొరికి పోయిన సుజాత కూడబెట్టిన సొమ్ము సర్కారు పాలుకాగా.. అవమానాలతో కుంగిపోయిన ఆమె భర్త మృత్యువు పాలయ్యారు. సస్పెన్షన్, కేసులు, భర్త ఆత్మహత్యతో అనారోగ్యానికి గురైన సుజాత.. తాజాగా గుండెపోటుతో తనువు చాలించింది.
రెండేళ్ల క్రితం బంజారాహిల్స్‌లోని ఓ స్థలం వ్యవహరంలో 15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ షేక్‌పేట ఆర్ఐ నాగార్జున పట్టుబడిన కేసులో తహసీల్దార్ సుజాత హస్తముందని అవినీతి నిరోధక శాఖ తేల్చింది. ఆమె ఇంట్లో అనిశా చేసిన సోదాల్లో భారీగా నగదు లభ్యమైంది. నగదు విషయంలో తహసీల్దార్ సుజాతను మూడ్రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించారు.
ఆమెతో పాటు భర్త అజయ్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రశ్నించారు. భూముల విషయంలో తహసీల్దార్ ప్రమేయమున్నట్లు ప్రాథమిక నిర్ధరణ కావటంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ వ్యవహారంలో అజయ్ ఏసీబీ అధికారుల విచారణకు హాజరుకావాల్సిన రోజే ఆత్మహత్య చేసుకున్నారు. ఓ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేసే అజయ్ అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. భర్త ఆత్మహత్య, కేసులు, సస్పెన్షన్లతో సుజాత అనారోగ్యానికి గురయ్యారు. వారం క్రితం నిమ్స్‌లో చేరిన ఆమె తాజాగా గుండెపోటుతో ప్రాణాలు వదిలారు. ఉన్నత ఉద్యోగాలతో సంతోషంగా జీవిస్తున్నఆ కుటుంబాన్ని అవినీతి కేసు కబలించింది.