Crime News : ప్రస్తుతం జరుగుతున్న దారుణ ఘటనలు చూస్తుంటే మనుషులు ఎందుకు ఇలా తయారు అవుతున్నారని అనిపిస్తుంది. తల్లి, తండ్రి, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి అనే బంధాలను కూడా మరిచిపోతూ కర్కశులుగా మారుతున్నారు. తాజాగా ఢిల్లీలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇటీవల శ్రద్దా హత్య ఘటన మరవక ముందే ఓ యువకుడు తన కుటుంబం లోని తల్లిదండ్రులతో సహా మరో ఇద్దరిని హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం… ఓ యువకుడు తల్లిదండ్రులు, సోదరి, అమ్మమ్మను కత్తితో పొడిచి హత్య చేశాడు. కాగా ఈ విస్తుగోలిపే ఘటన మంగళవారం రాత్రి జరిగినట్లు సమాచారం అందుతుంది. 25 ఏళ్ల కేశవ్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన ఆ యువకుడు డ్రగ్స్ అడిక్షన్ సెంటర్ నుంచి ఇటీవలే విడుదలయ్యాడు. కుటుంబ సభ్యులపై కోపంతో మంగళవారం రాత్రి వారిపై దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో తల్లిదండ్రులు దినేష్ కుమార్ (42), ధర్శన్ సైనీ(40), అమ్మమ్మ దీవానో దేవి(75), సోదరి ఊర్వశి (22)లను కత్తితో పొడిచాడు. బలంగా కత్తితో పొడవడంతో వారు అక్కడిక్కడే మరణించారని విచారణలో తేలింది.
ముందుగా తండ్రిని హత్య చేసిన కేశవ్… ఆ తర్వాత అనుమానం రాకుండా బాత్ రూమ్లో మృతదేహాన్ని ఉంచాడు. ఆ తరువాత అమ్మమ్మను, ఉద్యోగం నుంచి తిరిగి వచ్చిన తన తల్లిని, చివరిగా తన సోదరిని కూడా చంపేశాడు. అర గంట వ్యవధి లోనే అందరినీ చంపేశాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే కేశవ్ ఈ దారుణానికి ఒడికట్టేందుకు కారణమయ్యాయని భావిస్తున్నట్లు తెలిపారు. యువకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.