Telangana Politics : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి తన ఛాంబర్‌లో కూసుకుంట్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం అసెంబ్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావ్, జగదీష్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ బలం అసెంబ్లీలో 104కు చేరింది. మజ్లిస్ కు ఏడుగురు, కాంగ్రెస్ కు ఐదుగురు, బిజేపికి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ఎన్నికలపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి, హరీష్‌రావు.. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇలా అందరినీ బరిలోకి దింపారు. మునుగోడులో మొత్తం 2,25,192 ఓట్లు పోలైతే… టీఆర్ఎస్‌కు 42.95 శాతం ఓట్లు, బీజేపీకి 38.38 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 10.58 శాతం ఓట్లు, ఇతరులకు 08.09 శాతం ఓట్లు దక్కాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీ వరుసగా మూడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది.
మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 ఆగస్టు 2న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2022 నవంబరు 3న జరిగే ఉప ఎన్నిక జరిగింది. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు మునుగోడులో పాగా వేయాలని తీవ్రంగా ప్రయత్నించాయి. ఎట్టకేలకు గులాబీ బాస్ వ్యూహం ఫలించి మునుగోడులో విజయం సాధించింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2014-2018 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో 22,552 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు అదే రాజగోపాల్ రెడ్డిపై 10 వేల 309 ఓట్ల తేడాతో గెలిచారు.