రాష్ట్రంలో మరో 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 261 బీసీ గురుకులాలు కొనసాగుతుండగా, కొత్తవాటితో ఆ సంఖ్య 310కి చేరనున్నది. కొత్త పాఠశాలల్లో 7,920 మందికి, కాలేజీల్లో 3,600 మందికి కలిపి అదనంగా 11,520 మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి 19 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే ఉండగా, విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ ఏటా కొత్త గురుకులాలను ఏర్పాటుచేస్తూ వస్తున్నారు.
బీసీ విద్యార్థుల కోసం 2017-18లో 119 మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లను నెలకొల్పారు. 2019-20లో మరో 119 పాఠశాలలు, 19 జూనియర్ కాలేజీలు, 1 డిగ్రీ కాలేజీ నెలకొల్పారు. పాఠశాలలను క్రమంగా జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ విద్యార్థుల కోసం 143 పాఠశాలలు, 119 స్కూల్ కమ్ జూనియర్ కాలేజీలు, 19 జూనియర్ కాలేజీలు, 1 డిగ్రీ కాలేజీ కలిపి మొత్తం 261 ఉన్నాయి. వీటిలో 1,52,440 మంది విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందుతున్నది.
ప్రవేశాల కోసం విపరీత పోటీ
బీసీ గురుకులాల్లో అత్యాధునిక విద్యతోపాటు నాణ్యమైన భోజనం అందుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన వస్తున్నది. దీంతో మరిన్ని బీసీ గురుకులాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవలే బీసీ సంక్షేమశాఖ, గురుకుల సొసైటీ అధికారులు సమావేశమై కొత్తగా 33 గురుకులాలు, 15 డిగ్రీ కళాశాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఏడాది నుంచే జిల్లా యూనిట్‌గా మరో 33 గురుకులాలను, 15 డిగ్రీ కాలేజీలను ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, అం దుకు నిర్దేశిత ప్రాంతాన్ని ఎంపిక చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆయా గురుకులాలకు కావాల్సిన సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపింది. ప్రభు త్వ నిర్ణయంపై బీసీ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.
గురుకులాల్లో 8 కంప్యూటర్ కోర్సులు
బీసీ గురుకులాలు, డిగ్రీ కాలేజీల ఏర్పాటుపై బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బీసీల విద్యాప్రదాతగా నిలుస్తున్నారని కొనియాడారు.ఐదేండ్లలో బీసీ గురుకులాలను 19 నుంచి 310కి పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. టీఆర్‌ఎస్ సర్కారు ఏకం గా 16 కాలేజీలను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. డిగ్రీ కాలేజీల్లో 8 కంప్యూటర్ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. రూ.80 కోట్లతో గురుకులాల్లో వాటర్ హీటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
రాష్ట్రంలో కొత్త గురుకులాలు, డిగ్రీ కళాశాలలు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. బీసీ గురుకులాల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నాం. అందుకోసం అడ్మిషన్ల కోసం పెద్ద మొత్తంలో దరఖాస్తులు వస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొనే సీఎం కేసీఆర్ కొత్త గురుకులాలను మంజూరు చేశారు. కొత్తగా మంజూరైన 33 గురుకులాలను ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నాం.
-గంగుల కమలాకర్,బీసీ సంక్షేమ శాఖ మంత్రి.