Politics రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించేసింది కాంగ్రెస్ పార్టీ. మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని ఈ ఉప ఎన్నిక బరిలోకి దింపేందుకు సిద్ధమైంది. ఇన్నాళ్లు టికెట్ ఇస్తామని ఆశ చెప్పి ఒక్కసారిగా పక్కకు తోసేసిన నేతలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతలతో సమావేశమై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తామూ.. మునుగోడు ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైనట్లు వెల్లడించారు. రేపటి నుంచి మునుగోడు ప్రచారానికి తమ నేతలు వెళతారని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే క్షేత్రస్థాయి ప్రచారం మాత్రం సెప్టెంబర్ 18 నుంచి జరగనుందని ప్రకటించారు.
అయితే తమ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు విపక్షాలు చాలానే ప్రయత్నాలు చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలను తాము ఎంతో చాకచక్యంగా ఎదుర్కొంటామని తెలిపిన రేవంత్.. తెలంగాణ ప్రభుత్వం వైఫల్యాలను తప్పకుండా మునుగోడు ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఎన్నికల్లో ప్రచారానికి సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ ప్రతి మండలం పైన ఎంతో కాన్సన్ట్రేషన్ పెట్టింది. మండలానికి ఇద్దరి ఇన్చార్జిలను నియమించినట్లు తెలిపింది.
ఈ మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్.. బీజేపీ.. టిఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా పాల్గొననున్నాయి. ప్రతి పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు ఈ ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. ఇందుకు కసరత్తులు కూడా మొదలుపెట్టారు.


























