Crime భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని దిల్‌కుషా కాలనీలో నిర్మాణంలో ఓ గోడ పక్కనే రాత్రి కూలీలు నిద్ర పోయారు. వారంతా నిద్రలో ఉండగా… తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో… అక్కడికక్కడే 10 మంది కూలీలు మృతి చెందగా… మరికొంత మందిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు డీఎం సూర్యపాల్ గంగ్వార్ ధృవీకరించారు. మృతుల్లో ముగ్గురు 18 ఏళ్ల లోపు చిన్నారులున్నట్లు తెలిపిన అధికారులు…. మరికొందరు మహిళలు, పురుషులు ఉన్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యిందని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
సహాయక చర్యల్లో ఆర్మీ జవాన్లు… ప్రమాదం జరిగిన స్థలం ఆర్మీ క్యాంప్‌నకు సమీపంలోనే ఉండడంతో… ప్రమాదం చోటుచేసుకున్న వెంటనే ఆర్మీ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకుని, రక్షణ చర్యలు చేపట్టారు. ప్రమాదంపై సీఎం యోగి అన్ని వివరాలు తెప్పించుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకోవాలని డీఎం, పోలీసు అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన సీఎం యోగి…. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.