సాధారణంగా క్షణికావేశంలోనో పక్కా ప్లాన్ తోనో దొంగతనం, దోపిడీ, మానభంగం, హత్యలాంటివాటికి పాల్పడితే పోలీసులు అరెస్టు చేయడం, ఆ తర్వాత కోర్టులో హాజరుపరచడం, నేరం రుజువైతే జైలుకు పంపడం మామూలే. కొందరు నేరం రుజువయ్యేదాకా, అలాగే బెయిల్ దొరక్కపోయినా ఊచల్లెక్కిస్తూ కూర్చోవలసిందే…! అయితే, వీటన్నింటితో సంబంధం లేకండా జైలుకెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటే ఓ ఐదొందలిస్తే చాలు. వాళ్లే ‘సకల సౌకర్యాలతో’ మనల్ని కటకటాల రుద్రయ్యను చేస్తారు. జైల్లో ఎంజాయ్ చేయడమేంటీ అంటారా? అదేంటో ఒక్కసారి చూడండి.
ఉత్తరాఖండ్ లోని ఈ జైలుకు ఏ నేరం చేయకపోయినా వెళ్లొచ్చు. అంతేకాదు, ఆ జైలులో ఒక రాత్రి గడపొచ్చు. అందుకు ఐదొందల రూపాయలు చెల్లించాలి. ఆ జైలు అధికారులే తగిన ఏర్పాట్లు చేస్తారు. ఈ జైలు హల్ద్వానీలో ఉంది. అనేక నేరాలకు పాల్పడినవారు ఇక్కడ ఖైదీలుగా వున్నారు. హల్ద్వానీ పట్టణానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. వారిని ఆకట్టుకుని, నిజమైన జైల్లో ఎలా వుంటుందో వారికి అనుభూతిని అందించేందుకు రాష్ట్ర జైళ్ల శాఖ ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది.
హల్ద్వానీ జైలు చాలా పురాతనమైనది. బ్రిటీష్ హయాంలో 1903లో ఈ కారాగారాన్ని నిర్మించారు. ఇందులో సిబ్బందికి కొన్ని క్వార్టర్స్ కూడా వున్నాయి. అయితే, ఇప్పుడవి వాడకంలో లేవు. జైల్లో గడపాలనుకునే పర్యాటకుల కోసం ఇప్పుడీ క్వార్టర్స్ ను ముస్తాబు చేస్తున్నారు. జైల్లో గడిపేందుకు వచ్చే పర్యాటకులకు వసతి ఏర్పాటు చేయడమే కాదు, జైలు ఖైదీలకు ఇచ్చే యూనిఫాం ఇస్తారు. ఖైదీలకు అందించే భోజనమే వారికీ అందిస్తారు.
అంతేకాదు, ఈ జైలు పర్యాటకం వెనుక మరో కారణం కూడా వుంది. ‘బంధన యోగం’ నుంచి బయటపడాలంటే కొన్నాళ్లు నిర్బంధంలో గడపాలని జ్యోతిషులు చెబుతుంటారని, అలాంటివాళ్లు కూడా జైలులో గడిపేందుకు ఈ పథకం ఉపకరిస్తుందని భావిస్తున్నారు.