ఆ అబ్బాయికి ఇదివరకే పెళ్లయి విడాకులు తీసుకున్నాడని తెలిసే ప్రేమించి పెళ్లి చేసుకుంది ఓ అమ్మాయి. ఈ విషయం ఆమె ఇంట్లో సభ్యులకు కూడా తెలీకుండా జాగ్రత్త పడింది. చివరకు పెళ్లయిన 5 నెలలకే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
గుంటూరుకు చెందిన శ్రావణి అనే అమ్మాయి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో లా చదువుతుంది. శ్రావణి తన సీనియర్ అయిన వినయ్‌కుమార్‌ను ప్రేమించింది. ఇదివరకే వినయ్‌కు పెళ్లి జరిగి విడాకులు కూడా తీసుకున్నాడని తెలిసే జూన్‌లో పెళ్లి చేసుకుంది. వారు పెళ్లి చేసుకున్న విషయం శ్రావణి తన ఇంట్లో ఎవరకీ చెప్పలేదు. ఇద్దరూ కలిసి వైజాగ్‌లోనే కాపురం పెట్టారు. వినయ్ చదువుకుంటూనే ఓ రెస్టారెంట్‌లో ఉద్యోగం చేస్తుండగా.. శ్రావణి పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంది. కొన్ని రోజులుగా ఈ జంట తరచూ గొడవ పడుతున్నారు. 3 రోజుల క్రితం శ్రావణి పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఇద్దర్ని పిలిచారు. ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కౌన్సిలింగ్ జరుగుతుండగా మధ్యలో శ్రావణి బయటకు వచ్చి తప్పు అంతా నాదే.. అంటూ గట్టిగా అరుస్తూ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన ఎస్‌ఐకు గాయాలయ్యాయి. శ్రావణిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె చనిపోయింది.