Char Dham Tour : ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర నేటితో ముగిసింది. హిమపాతం, శీతాకాలంలో తీవ్రమైన చలి కారణంగా, ప్రతి సంవత్సరం అక్టోబర్-నవంబర్లలో చార్ ధామ్ లు మూసివేయబడతాయి. వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో తిరిగి వీటిని తెరవనున్నారు. శీతాకాలం సందర్భంగా మంచుతో ఆలయాలు కప్పబడి ఉండనున్న కారణంగా ప్రతి ఏటా ఈ విధంగా నిర్వహించడం జరుగుతుంది. దీంతో ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలను నిర్వహించి కేదార్‌నాథ్ ధామ్ తలుపులు మూసివేశారు. ఆర్మీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్దలతో శివయ్య పంచముఖీ దేవత విగ్రహం శ్రీ ఓంకారేశ్వరాలయం, ఉఖీమఠ్ కు తీసుకుని వచ్చారు. వచ్చే 6 నెలల పాటు ఉఖిమఠ్‌లో పూజలు నిర్వహించనున్నారు.
అదే విధంగా ఉత్తర కాశీలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యమునోత్రి ధామ్ తలుపులు కూడా నేటి నుంచి మూతబడనున్నాయి. ఈరోజు భయ్యా దూజ్ సందర్భంగా యమునోత్రి తలుపులు వచ్చే ఆరు నెలల పాటు మూసివేయబడతాయి. ఈ మేరకు పూజారులు యమునా దేవి గుడి తలుపులు ఈరోజు మధ్యాహ్నం 12.09 గంటలకు మూసివేయనున్నారు. శని మహారాజ్ నేతృత్వంలోని యమునా దేవి ఈ రోజు యమునోత్రి ధామ్ నుండి బయలుదేరి… శీతాకాల విడిది స్థలం అయిన ఖర్సాలీ గ్రామానికి వెళ్లనున్నది. దీనితో పాటు నవంబర్ 18 శుక్రవారం రెండవ కేదార మద్మహేశ్వర, నవంబర్ 7 న మూడవ కేదార తుంగనాథ్ తలుపులు మూసివేయబడతాయి.
ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన గర్వాల్ హిమాలయ ప్రాంతంలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులు బుధవారం అన్నకూట్ సందర్భంగా మూసివేయబడ్డాయి. చలికాలంలో ఆరు నెలల పాటు ఆలయాన్ని మూసివేసే సమయంలో… భక్తులు ముఖ్బా గ్రామంలోని గంగామాతను ఆరాధిస్తారు. నవంబర్ 19న బద్రీనాథ్ తలుపులు మూసివేయనున్నారు. కోవిడ్ నిషేధం కారణంగా రెండేళ్ల తర్వాత చార్‌ధామ్ యాత్రలో నిర్వహించారు. చార్ ధామ్ యాత్ర మే 3, 2022న అక్షయ తృతీయ సందర్భంగా ప్రారంభమైంది. ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు చేరుకున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 24 వరకు చార్ ధామ్ యాత్రకు 43 లక్షల 9 వేల 634 మంది యాత్రికులు వచ్చారు.

























