‘ఎలుకల చిచ్చుకి ఇంటిని తగులబెట్టినట్టు…’ అని మనకో సామెత వుంది. ఈ సామెతను మనం లోతుగా ఆలోచిస్తే ఆ ఎలుకలు ఎంత ఫ్రస్ట్రేషన్ కి గురి చేస్తే అతగాడు అంత పని చేసి వుంటాడూ…! అనిపించక మానదు. కొన్ని సందర్భాల్లో ఫ్రస్ట్రేషన్ లో ఏంచేస్తారో వాళ్లకే అర్థంగాదు. ఆ తర్వాత బహుశా వాళ్లూ నేనేనా ఈ పని చేసిందీ అని ఆశ్చర్యపోతారేమో… మన హైదరాబాద్ అమీర్ పేట్ లోని మైత్రీవనం వద్ద ఇలాంటి సంఘటనే జరిగింది. ఇది చూసి అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అదేంటంటే…
రోడ్డు మీద టూ వీలర్ పైన గానీ, ఫోర్ వీలర్ లో గానీ వెళుతుంటే అనుమానించి ట్రాఫిక్ పోలీసులు ఆపడం, డ్రైవింగ్ లైసెన్స్ గానీ, ఇంకేదైనా గానీ లేకపోతే, స్పీడుగా వెళుతుంటే ఫైన్ వేయడం మామూలే. అయితే, ఒక వ్యక్తి అప్పటికే ఇలాంటి వాటికి విసిగిపోయి వున్నాడో ఏవిటో… రాంగ్ రూట్లో వెళుతున్న కారణంగా ఎల్లారెడ్డిగూడకు చెందిన అశోక్ అనే వ్యక్తిని ట్రాఫిక్ పోలీస్ ఆపాడు. దీంతో అప్పటికే మాంఛి ఫ్రస్ట్రేషన్ లో వున్నాడేమో… పోలీసుల కళ్ల ముందే తన బైకు మీద తనే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ఏంజరిగిందన్నదాని కంటే, అశోక్ ఫ్రస్ట్రేషన్ శాంతించుగాక అని ప్రార్థిద్దాం…!