మనతో ఏ మాత్రం పరిచయం లేనివాళ్లు ఆత్మహత్యాయత్నం చేస్తూంటేనే చూస్తూ వూరుకోలేం. వెళ్లి అడ్డుకుంటాం, ఏదో ఒకటి చేసి వారిని కాపాడేందుకే శతవిధాలా ప్రయత్నిస్తాం. కానీ, తనతో ఏడడుగులూ నడచి తన జీవితంలోకి వచ్చిన భార్య మనస్తాపంతో ఉరి వేసుకుంటూంటే ఆ దృశ్యాన్ని వీడియో తీస్తూ కూర్చున్నాడో ప్రబుద్ధుడు.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కళ్లముందే భార్య ప్రాణం పోతుంటే అడ్డుకోకుండా ఫోన్లో వీడియో తీస్తూ కూర్చున్నాడో భర్త. తర్వాత భార్య తరపు వాళ్లకు ఆ వీడియో చూపడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో సదరు భర్తను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
కాన్పూర్ కు చెందిన సంజయ్ గుప్తా, షోబితా గుప్తాలకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. కాన్పూర్ లోనే కాపురం ఉంటున్నారు. అయితే, ఇటీవల భార్యాభర్తల మధ్య విభేదాలు పొడసూపాయి. దీంతో తరచుగా గొడవపడుతున్నారు. ఈ క్రమంలోనే ఒక రోజు షోబిత ఆత్మహత్యకు ప్రయత్నించింది. బెడ్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయేందుకు ప్రయత్నించింది. సంజయ్ కూడా అక్కడే ఉన్నప్పటికీ షోబితా ప్రయత్నాన్ని అడ్డుకోలేదు. పైపెచ్చు అదంతా వీడియో తీస్తూ కూర్చున్నాడు. చీరను మెడకు తగిలించుకుని చివరిసారిగా తనవైపు చూసిన షోబితాతో ‘ఇదన్నమాట నీ మనస్తత్వం. ఇదే నా నీ మైండ్ సెట్..’ అన్నాడు సంజయ్. దీంతో షోబితా తన మెడకు తగిలించుకున్న ఉరిని తీసేయడం వీడియోలో కనిపించింది. అక్కడితో వీడియో అయిపోయింది.
షోబిత మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసి షోబిత తల్లిదండ్రులు ఉరుకులు పరుగులతో కూతురు ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. అప్పటికే బెడ్ మీద చలనంలేకుండా పడిపోయిన షోబితాకు సంజయ్ సీపీఆర్ చేస్తున్నాడు. కృత్రిమంగా శ్వాస అందించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆపై షోబితాను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే షోబితా చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఏం జరిగిందని నిలదీయడంతో సంజయ్ తమకు ఓ వీడియో చూపించాడని షోబితా తల్లిదండ్రులు చెప్పారు. అందులో తమ కూతురు ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నదంతా రికార్డయి ఉందన్నారు.
कानपुर में एक महिला पंखे से लटक कर आत्महत्या का प्रयास कर रही थी, पति वीडियो बना रहा था जिसके बाद महिला की मौत हो गई| pic.twitter.com/dqMvgWl2SV
— Priya singh (@priyarajputlive) October 26, 2022
షోబితా మానసిక అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడిందని, గతంలోనూ ఆత్మహత్యకు ప్రయత్నించిందని సంజయ్ చెప్పాడన్నారు. షోబితా ఉరి వేసుకునే ప్రయత్నం చేస్తుంటే ఆపకుండా ఏం చేస్తున్నావని సంజయ్ పై వాళ్లు మండిపడ్డారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సంజయ్ ను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏదేమైనా, అసలు ఆ భర్తను ఏ తిట్ల దండకంతో తిట్టాలో కూడా అర్థం కావట్లేదు గదూ…!!