యూత్, మెసేజ్, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్ మామ`హైబ్రిడ్ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, ప్రఖ్యాత బ్యానర్ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేం సోహెల్`- మృణాళిని హీరో – హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం.
తుది దశ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించి శ్రీమణి రచించగా, శ్రీకృష్ణ`హరిణి ఆలపించిన తొలి లిరికల్ ‘‘అల్లసాని వారి అల్లిక’’ సాంగ్ విడుదల కార్యక్రమం నిర్మాత సి. కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం (9వ తేదీ) హైదరాబాద్‌లోని ఎఫ్.ఎన్.సి.సిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ విచ్చేసి, ఫస్ట్ లిరికల్‌ను లాంచ్ చేశారు. ఈ సాంగ్ ‘సరిగమలు’ ద్వారా అందుబాటులో ఉంది.
నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. మీ అందరి సమక్షంలో ఈ బర్త్‌డే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా గురువుగారు దాసరి గారి బర్త్‌డేనే మేం అందరం మా బర్త్‌డేగా ఫీలవుతాం. ఈరోజు ఆయన లేరు కాబట్టి ఆయన్ను తలుచుకుంటూ ఈ బర్త్‌డే చేసుకుంటున్నా. సినిమాల్లో నేను సంపాదించింది ఏమీ లేదు. కానీ సినిమా వాడిగా నాకున్న ఇమేజ్‌తో బయట ఇతర వ్యాపారాల్లో సంపాదించి సినిమాలు తీస్తుంటాను. చిల్లర కల్యాణ్‌గా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాకు ఈరోజు ఇంత గుర్తింపు వచ్చింది అంటే.. అది కేవలం సినిమా పరిశ్రమ నాకు కల్పించిన అద్భుత అవకాశం. అందుకే నా ఊపిరి ఉన్నంత వరకూ సినిమా పరిశ్రమతోనే ఉంటా.
కృష్ణారెడ్డిగారి దర్శకత్వంలో కల్పన నిర్మిస్తున్న ఈ సినిమా అరిటాకులో వడ్డించిన అచ్చతెలుగు భోజనం. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కేవలం తెలుగు వారే. కెమెరామెన్ రామ్‌ప్రసాద్ చాలా పట్టుదలగా ఈ సినిమా చేశాడు. సోహెల్ చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. తప్పకుండా మంచి రేంజ్‌కు చేరుకుంటాడు. కృష్ణారెడ్డి గారితో మా అనుబంధం ఈ రోజుది కాదు. ఆయన సినిమా ప్రేమికుడు. కల్పన తొలి స్ట్రెయిట్ ప్రొడక్షన్ ఆయనతో చేయడంతోనే సగం సక్సెస్ కొట్టేసింది. తెలుగు సినిమా చరిత్రలో మీ పేరు మారుమోగి పోయే ఒక ప్రాజెక్ట్ చేయండి అని ఆమె ఇచ్చిన సలహా మేరకే బాలయ్య బాబుతో ‘రామానుజాచార్య’ భారీగా తెరకెక్కించబోతున్నాను. కృష్ణారెడ్డి`అచ్చిరెడ్డి ఎప్పుడూ నిర్మాతల శ్రేయస్సు కోరే వ్యక్తులు. ఈ స్క్రిప్ట్‌లో అన్నీ బాగా కుదిరాయి ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.