జగపతి బాబు ఫ్యామిలీ హీరోనా, విలనా, క్యారెక్టర్ ఆర్టిస్టా…? ఏంటి? ఒక్కమాటలో చెప్పాలంటే మంచి నటుడు… జనం మెచ్చిన మంచి నటుడు… విభిన్న పాత్రలలో విలక్షణ అభినయాన్ని ప్రదర్శిస్తూ సాగిపోతున్న నటుడు. వి.బి.రాజేంద్ర ప్రసాద్ తనయుడైన ఆయన, తొలిచిత్రం ‘సింహస్వప్నం’తోనే అరుదైన రికార్డును సాధించారు. తొలిచిత్రంలోనే ద్విపాత్రాభినయం చేయడం అయితే, ఆ సినిమాకు సక్సెస్ అనేది కూడా స్వప్నమే అయింది. ఆ తర్వాత మెల్లిగా కాస్త కుదురుకుని ‘పెద్దరికం’తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మంచి నటుడిగా గుర్తింపు పొందాలనే లక్ష్యం నుండి జగపతి తప్పుకోలేదు, విభిన్న పాత్రల ఎంపికను మానుకోలేదు. ‘గాయం’, ‘అంతఃపురం’ మొదలైన చిత్రాల్లో నటుడిగా మరో కోణాన్ని ఆవిష్కరింపజేసి ప్రేక్షకులను అచ్చెరువొందించారు ఆయన. ‘శుభలగ్నం’, ‘మావి చిగురు’ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యారు జగపతి బాబు. ‘అంతఃపురం’ చిత్రాన్ని ‘శక్తి’ పేరుతో హిందీలో పునర్నిర్మించగా, జగపతి బాబు తెలుగులో పోషించిన పాత్రను షారుఖ్ ఖాన్ పోషించారు. అయితే, జగపతి బాబు నటించినంత బాగా తాను నటించలేకపోయానని స్వయంగా షారుఖ్ అనడం ఎంతో గొప్ప విషయం.
‘లెజెండ్’లో జితేందర్ గా సెకెండ్ ఇన్నింగ్ మొదలు పెట్టక ముందు జగపతి బాబు కెరీర్ ఒక ఎత్తు అయితే, ఆ తర్వాతి కెరీర్ మరో ఎత్తు. అలాగని కేవలం ప్రతినాయక పాత్రలకే పట్టం కట్టలేదు ఆయన. అందుకు ఉదాహరణ… ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’, అరవింద సమేత వీర రాఘవ’ మొదలైన చిత్రాల్లో ప్రతినాయక పాత్రల్లో కొనసాగుతూనే, ‘శ్రీమంతుడు’లాంటి చిత్రాల్లో తన అభినయ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారు జగపతి. అయితే, నిజానికి సినీరంగంలో కొనసాగాలనే ఆలోచన జగపతి బాబుకీ వుండేది కాదుట. అందుకే చదువైపోయాక కొంతకాలం విశాఖపట్నంలో వుంటూ వ్యాపారిగా కొనసాగారు. అయితే, హఠాత్తుగా ఆయన ఆలోచన ఎందుకు మారిందో తెలీదు గానీ, రాత్రికి రాత్రే తన నిర్ణయాన్ని మార్చుకుని నటుడిగా మారిపోయారు ఆరోజు ఆయన ఆ నిర్ణయం తీసుకుని వుండకపోతే తెలుగు సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయి వుండేదనేది మాత్రం వాస్తవం.