ఎండలు, వర్షాలు మితంగా వుంటేనే జన జీవనం సాఫీగా సాగిపోతుంది. ఎండలు ఎక్కువైనా, వర్షాలు ఎక్కువైనా జన జీవనం అస్తవ్యస్థమైపోతుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నదులూ, వాగులూ, వంకలూ పొంగి పొర్లుతున్నాయి. ఉత్తర తెలంగాణలో వందలాది గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎటు చూసినా ఉధృతంగా ప్రవహిస్తున్న నీరే కనిపిస్తోంది.
హైదరాబాదులో సైతం ఎడతెరిపిలేని వర్షంవల్ల జనం అవస్థలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకూ ఈ నెల 11, 12, 13 తేదీల్లో సెలవు ప్రకటించి ఆ తర్వాత వాతావరణ శాఖ హెచ్చరికలతో మరో మూడు రోజులపాటు పొడగించింది.
రోజుల తరబడి సూర్యుడు కనిపించకపోయేటప్పటికి సూర్యుడికి కరోనా వచ్చి హోం క్వారంటైన్ లో వున్నాడంటూ వాట్సప్ లో జోకులు దర్శనమిచ్చాయి.
అయితే, తాజాగా, ఈరోజు ఉదయం అనూహ్యంగా ఆకాశంలో సూర్యుడి దర్శనం కావడంతో ప్రజల్లో ఉత్సాహం పెల్లుబికింది. వర్షం నుండి కాస్త ఉపశమనం కలిగిందనే భావిస్తున్నారు.