నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించారు. అఖండ సినిమా సక్సెస్ లో భాగంగా అఖండ విజయోత్సవ జాతర కార్యక్రమాన్ని గురువారం వైజాగ్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అభిమానులు, ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘సినిమాను ఇంత విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. అఖండ టైటిల్ ఎలా ఉందని బోయపాటి గారు అడిగారు. చాలా బాగుంది.. దీంతోనే ముందుకు వెళ్దామని అన్నాను. సింహ, లెజెండ్ తరువాత చేస్తున్న సినిమా కాబట్టి కాస్త భయం ఉంటుంది. కానీ ఒక సినిమా అయిన తరువాత మళ్లీ వాటి గురించి ఆలోచించను. మా ఇద్దరి మధ్య మాకు విశ్వాసం ఉంటుంది. నానుంచి ఏం కావాలో ఆయనకు తెలుసు. ఆయన నా నుంచి ఏం ఆశిస్తుంటారో నాకు తెలుసు. బోయపాటి గారు నాకు ఇంత వరకు ఏ సినిమా కథ కూడా పూర్తిగా చెప్పలేదు. ఆయనకు నా మీద అంత విశ్వాసం ఉంది. అభిమానులు నా నుంచి ఎప్పుడూ ఏమీ ఆశించరు. వెలకట్టలేనిది అభిమానం. విజయాల్లో అందరూ పాలుపంచుకుంటారు. కానీ అపజయాల్లో నా వెంటే ఉన్నారు. మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదిరిస్తూనే వస్తున్నారు. తిరణాళ్లకు వెళ్లినట్టు సినిమా థియేటర్లకు వెళ్లి సినిమాను ఆదరించారు. మంచి సినిమాలను ఆదరిస్తారని మళ్లీ నిరూపించారు. ఇది మా విజయమే కాదు. చలనచిత్ర విజయం.
శ్రీకాంత్, జగపతి బాబు, నితిన్ మెహతా ఇలా అందరూ ఎంతో బాగా నటించారు. ప్రగ్యా జైస్వాల్‌కు టాలెంట్‌తో పాటు అందం కూడా ఉంది. అభిమానులను ఎలా రెచ్చగొట్టాలో.. థియేటర్లో రచ్చ రచ్చ చేయించాలో బోయపాటికి, నాకు తెలుసు. స్టన్ శివ మంచి ఫైట్స్ కంపోజ్ చేశారు. ఆయన చెప్పినట్టుగా.. దర్శకుడు కూడా ఓ ఫైట్ మాస్టర్. మంచి సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూశారో.. మేం కూడా ఎదురుచూశాం. మా నిర్మాతలు కూడా ఎదురుచూశారు. కానీ మా నిర్మాత ఎప్పుడూ భయపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సినిమాను విడుదల చేసినందుకు నా కృతజ్ఞతలు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించినందుకు నా తరుపున, నా అభిమానుల తరుపున కృతజ్ఞతలు. ఇలాంటి వేడుకలు మనం ఇంకా జరుపుకోవాలి. మనం అంటే పరిశ్రమను. మంచి సినిమాలను ఆదరించాలి. అఖండ సినిమాను ఘన విజయం చేసిన ప్రతీ ఒక్కరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’ అని అన్నారు.