AP High Court : ఆంధఫ్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వ సలహాదారుల నియామకం విషయంలో ఏపీ హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. సలహాదారులుగా ఎవరిని నియమించుకోవాలన్నది పూర్తిగా ప్రభుత్వ ఇష్టమని ఈ విషయంలో ఇతరుల జోక్యానికి తావు లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ సలహాదారుగా (ఉద్యోగులు సంక్షేమం) చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గతేడాది జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ కడప జిల్లాకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి మునయ్య హైకోర్టులో పిల్ వేశారు.
కాగా దీనిపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన చంద్రశేఖర్‌రెడ్డిని ఉద్యోగుల సంక్షేమం విషయంలో సలహాదారుగా ప్రభుత్వం నియమించిందని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. ఉద్యోగులతో సమన్వయం చేయడం ఆయన బాధ్యతని… వాస్తవానికి ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రస్తుతం కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయని కోర్టుకు వివరించారు. సలహాదారును నియమించాల్సిన అవసరం లేదన్నారు.
సలహాదారుగా ఎవరిని నియమించాలన్నది ప్రభుత్వ ఇష్టమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఇతరులకు లేదని చంద్రశేఖర్ రెడ్డి నియామక ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని లాయర్ కోరగా ధర్మాసనం తిరస్కరించింది. ప్రభుత్వ సలహాదారు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి నియామక ఉత్తర్వుల అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నో చెప్పింది. అలాగే చంద్రశేఖర్‌రెడ్డి నియామకంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీఎస్, జీఏడీ ముఖ్య కార్యదర్శితో పాటు చంద్రశేఖర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది.