politics తెలంగాణ సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తీరుపై భాజాపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తారా అంటూ స్పీకర్‌పై మండిపడ్డారు. నిజానికి స్పీకర్ ఏ పార్టీకి సపోర్ట్ చేయడం కానీ, ఎవరిని విమర్శించడం కానీ చేయరాదు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్నవారు ఆ పదవికి తగినంత విలువ కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఈ నియమాలను పోచారం శ్రీనివాసరెడ్డి పాటించడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. సభలో చర్చ జరగాలని, స్పీకర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భాజాపాను చూస్తేనే కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం గజగజ వణికిపోతున్నారని విమర్శించారు. అసెంబ్లీ నిర్వహించాలంటే భయపడుతున్నారని అన్నారు.
పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, జిల్లా ఇంఛార్జ్‌లతో బండి సంజయ్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రజా సమస్యలపై చర్చించకుండా తెలంగాణ సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుట్ర చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రజా క్షేత్రంలోనే అన్నీ తేల్చుకుంటాం. హిందూ పండుగలకు ప్రాధాన్యత లేకుండా కేసీఆర్ చేస్తున్నారు. తెర వెనుక మహా కుట్ర చేస్తున్నాడు. షరతుల పేరుతో కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇదంతా హిందువులకు హిందూ పండుగలకు ప్రాధాన్యత లేకుండా చేయడంలో భాగమే. హిందువులంతా ఏకం కావాల్సిన సమయం వచ్చింది. హిందూ సమాజమంతా సంఘటితం కావాల్సిందే” నని బండి సంజయ్ పిలుపునిచ్చారు.


























