`పుష్ప` సినిమాలో నెగెటివ్ రోల్ చేసిన ధనుంజయ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కన్నడలో 8 సినిమాల్లో హీరోగా చేసి, 9వ సినిమా శివరాజ్ కుమార్ సినిమాలో విలన్‌గా చేశారు. ఆ చిత్రంలోని డాలీ పేరుతో డాలీ ధనుంజయ్ గా పాపులర్ అయ్యారు. ఆయన తాజాగా నటించిన సినిమా `బడవ రాస్కెల్`. శ్రీమతి గీతా శివరాజ్‌కుమార్ సమర్పకులుగా ఈ సినిమాకు వ్యవహరించారు. శంకర్ గురు దర్శకత్వం వహించారు. డిసెంబర్‌లో ఈ సినిమా కన్నడలో విడుదలై విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఇదే సినిమాను తెలుగులోనూ బడవ రాస్కెల్ గా అనువదించారు. ఈ చిత్రం ఈనెల 18న విడుదలకాబోతోంది. ఈ సినిమా గురించి డాలీ ధనుంజయ్ హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో పలు విషయాలు తెలియజేశారు.
పుష్ప సినిమా అనుభూతి మాటల్లో చెప్పలేనిది. కన్నడలోనేకాదు ఎక్కడికి వెళ్ళినా నన్ను చూడగానే `తగ్గేదేలే` అంటూ గుర్తుపెట్టుకుని పలుకరిస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ లతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా.
నేను కన్నడలో 9 సినిమాలు చేసినా పుష్ప తర్వాత మరింత గుర్తింపు వచ్చింది. కొంతమంది స్నేహితులు ఎందుకు తెలుగులో నటించావని కూడా అడిగారు. నటుడికి పరిధిలేదని చెప్పాను.కన్నడలో పేరున్న హీరోల సినిమాలు, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి సినిమాలు వచ్చినా ఎక్కడా కాంపిటేషన్ అనిపించదు. హెల్తీ కాంపిటేషన్‌గానే వుంటుంది. నా బడవ రాస్కెల్ విడుదలైనప్పుడు హాలీవుడ్ సినిమాలు కూడా విడులయ్యాయి. మరోవైపు ఇక్కడి హీరోల సినిమాలు కూడా విడుదలయ్యాయి. ఎవరి సినిమాలు వారివే. నా సినిమా కూడా విడుదలై విజయవంతం అయింది. అని తెలిపారు.