BULLION MARKET, Gold Hallmarking Mandatory Now, What is BIS Hallmark Gold,
ఇకపై బంగారానికి హాల్ మార్క్ తప్పనిసరి!
బంగారం స్వచ్ఛమైందా కాదా? అని తెలుసుకోవడానికి హాల్‌మార్క్
* నకిలీ బంగారానికి అడ్డు కట్ట వేయటమే ధ్యేయంగా చర్య
* జూన్ 1వ తేది నుంచి హాల్ మార్క్ తప్పనిసరి
* 2021, జనవరి 15నే ప్రారంభం కావల్సి ఉన్న హాల్ మార్క్
* కరోనా కారణంగా గడువు తేదీని పెంచిన కేంద్రం
* 34,647 మంది వ్యాపారులు బీఐఎస్‌లో నమోదు
* వచ్చే రెండు నెలల్లో లక్ష వరకూ పెరగొచ్చని అంచనా
* జూన్ 1 నుంచి 14, 18, 22 క్యారెట్ల బంగారానికి మాత్రమే అనుమతి
* వినియోగదారులు మోసపోకుండా చేసే హాల్ మార్క్
బంగారాన్ని, భారతీయులను విడతీసి చూడలేం. ప్రపంచవ్యాప్తంగా బంగారంపై క్రేజ్ ఎక్కువగా ఉండే దేశాల్లో భారత్ తొలి వరుసలో ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. మీరు కొనుగోలు చేసే బంగారం స్వచ్ఛమైందా కాదా? అని తెలుసుకోవడానికి హాల్‌మార్క్ ఉంటుందని మీలో ఎంత మందికి తెలుసు. అయితే ఇప్పటి వరకు హాల్‌మార్క్ తప్పనిసరి అనే నిబంధన లేకపోవడంతో చాలా మంది అవగాహన లేక మోసపోతున్నారు. దీంతో కొందరు వ్యాపారస్తులు నకిలీ బంగారాన్ని వినియోగదారులకు విక్రయిస్తున్నారు. తాజాగా దీనికి చెక్ పెట్టడానికే ప్రభుత్వం బంగారం స్వచ్ఛతను నిర్ధారించే హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేసింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేయడానికి సిద్ధమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 13న తెలిపింది. ఇదిలా ఉంటే ఇది వరకు హాల్ మార్క్ పద్ధతి అమలు చేయాలని 2019లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం వ్యాపారుకులకు 2021, జనవరి 15 వరకు గడువు ఇచ్చింది.
అయితే గతేడాది కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడం, లాక్‌డౌన్ కారణంగా దుకాణాలు సైతం మూతపడడంతో ఈ గడువును పెంచాలని వ్యాపారులు కేంద్రాన్ని కోరారు. దీనికి ఓకే చెప్పిన కేంద్రం జూన్ 1 వరకు గడువు పొడగించింది. అయితే మరోసారి ఈ గడువును ఎట్టి పరిస్థితుల్లో పెంచే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే ఇప్పటివరకు 34,647 మంది వ్యాపారులు బీఐఎస్‌లో నమోదు చేసుకున్నారని… రాబోయే రెండు నెలల్లో సుమారు లక్ష మందికి పైగా నమోదవుతారని బిఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ చెప్పారు. జూన్ 1 నుంచి 14, 18, 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే విక్రయించడానికి అనుమతి ఉంటుందని ప్రమోద్ కుమారు తెలిపారు. బీఐఎస్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. హాల్‌మార్క్ ఉండటం వల్ల బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు వీలవుతుంది.