హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. భారీగా ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉంది. వెంటనే హైదరాబాద్ నుంచి సంబంధిత జిల్లా ఎస్పీతోపాటు క్షేత్రస్థాయి సిబ్బందికి, హైవేపై అందుబాటులో ఉన్న క్రేన్ల సిబ్బందికి, అంబులెన్స్‌కు ఏకకాలంలో సమాచారం వెళ్లింది. పరిస్థితి జటిలం అయ్యేలోపే ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంతోపాటు క్షతగాత్రులను దగ్గరలోని దవాఖానకు తరలించారు..
రద్దీగా ఉండే ప్రదేశంలో అనుమానాస్పదంగా ఒక వాహనం కొన్ని గంటలుగా ఆగి ఉంది. ఎవరూ ఫిర్యాదు చేయకుండానే దగ్గరలోని పోలీసులు అక్కడికి చేరుకొని విషయం ఆరా తీశారు.
అకస్మాత్తుగా ఓ షాపింగ్‌మాల్‌లో మంటలు వ్యాపించాయి. ఐదు అంతస్తుల్లో దాదాపు 500 మంది వరకు చిక్కుకుపోయారు. నిమిషాల వ్యవధిలోనే పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది, ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు స్పాట్‌కు చేరుకున్నాయి. చకచకా సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. ఆస్తినష్టం పెరగకుండా మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు..
ఓ చోట పది మంది గుంపుగా చేరి ఏదో అలజడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎవరూ సమాచారం ఇవ్వకుండానే దగ్గర్లోని పెట్రోలింగ్‌పార్టీ పోలీసులు అక్కడ వాలిపోయారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని అవాంఛనీయ ఘటనలను నిరోధించారు.
ఏంటీ..? ఇవన్నీ ఏవో సినిమాల్లోని దృశ్యాలు అనుకుంటున్నారా? కానే కాదు!! తెలంగాణ ప్రభుత్వం, పోలీస్‌శాఖ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రానుండటంతో రాష్ట్రంలో పైన పేర్కొన్న ఎటువంటి ఘటన జరిగినా పరిష్కారాలు అత్యంత వేగంగా ఉంటాయనడానికి ఉదాహరణలు.
ప్రజా రక్షణలో మూడో కన్నువంటి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) అతి త్వరలోనే మనకు అందుబాటులోకి రానున్నది. పోలీస్ సహా అన్ని ప్రభుత్వశాఖలను సమన్వయం చేసుకొనే తెలంగాణ స్టేట్ లెవల్ మల్టీ ఏజెన్సీ ఆపరేషన్స్ సెంటర్‌ను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్-12లో నిర్మించారు. ఈ బహుళ అంతస్తుల భద్రతా సౌధం హైదరాబాద్ మహానగరం సహా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరిగినా ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు సహా పూర్తి ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడి నుంచే పర్యవేక్షించడంతోపాటు రియల్‌టైంలోనే సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకొనేందుకు ఉపకరించనున్నది. తెలంగాణ పోలీస్ కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 4న ప్రారంభించనున్నారు.
ఏమిటి ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ?
అన్ని ప్రభుత్వరంగ వ్యవస్థలను సమన్వయం చేసుకొంటూ విపత్తుల సమయంలో ప్రజలను సకాలంలో కాపాడటం, నష్టాన్ని తగ్గించడంతోపాటు నిరంతర పర్యవేక్షణతో రాష్ట్రంలో నేరాలను నియంత్రించేందుకు ఏర్పాటు చేస్తున్న వ్యవస్థే సీసీసీ. బహుముఖ ప్రయోజనాలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర సర్కార్ దీన్ని ఏర్పాటు చేస్తున్నది. ఈ సెంటర్‌లో పోలీస్, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఆరోగ్యశాఖ, ప్రకృతివిపత్తుల నిర్వహణశాఖ సహా ముఖ్యమైన అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కేంద్రాలు ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అన్ని శాఖల సమన్వయంతో సమస్యను పరిష్కరిస్తారు. అదేవిధంగా రోజు వారీగా శాంతి భద్రతల పర్యవేక్షణ, ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఈ డాటాను వినియోగించుకోవచ్చు. రోజువారీ శాంతిభద్రతల నిర్వహణతోపాటు భారీ సభలు, ఉత్సవాల సందర్భంగా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ కూడా ఇక్కడి నుంచి సులభంగా చేయవచ్చు.
సీసీసీకి సంబంధించిన మరిన్ని విశేషాలు…
★ ఇక్కడ ప్రత్యేకమైన డాటా సెంటర్ ఉన్నది. బెల్జియం, జర్మనీ నుంచి సర్వర్లు తెప్పిస్తున్నారు. దాదాపు 30 పెటా బైట్ల సామర్థ్యం ఉన్న స్టోరేజీ ఉన్నది. దాదాపు 10 లక్షల సీసీటీవీ కెమెరాల ఫీడ్ ఇందులో నిక్షిప్తం అవుతుంది. ఆ తర్వాత అవసరమైన సమాచారం మినహా మిగిలిన సమాచారం నెల రోజుల తర్వాత డిలీట్ అవుతుంది.
★ హై ఎండ్ డాటా ఎనాలసిస్ సెంటర్‌లో సమాచారం అత్యంత గోప్యంగా, భద్రంగా ఉంటుంది.
★ ఉన్నతాధికారులు కాకుండా ఒక్కోషిప్ట్‌లో కనీసం 60 మంది టెక్నికల్ సిబ్బంది విధుల్లో ఉంటారు.
★ సీసీసీలో ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాల ఫీడ్ చూడగలిగే సామర్థ్యంతో భారీ స్క్రీన్ ఉంటుంది.
★ ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే, సీసీటీవీల్లోని ప్రత్యేక స్టాఫ్ట్‌వేర్ ద్వారా కెమెరానే నేరుగా సీసీసీకి అలర్ట్ పంపుతుంది. అక్కడ ఉన్న ఆపరేటర్‌కు ఆ కెమెరాకు సంబంధించి పాప్‌అప్ స్క్రీన్‌పై వస్తుంది. వెంటనే సిబ్బంది అలర్ట్ అవుతారు.
★ కేవలం రాష్ట్ర పోలీస్‌శాఖ ఏర్పాటు చేసిన సీసీటీవీలను మాత్రమే సీసీసీకి అనుసంధానిస్తారు.
★ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు, అన్ని అంబులెన్స్‌లు, ఫైర్ స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, అన్ని ప్రధాన లొకేషన్లు, బస్‌స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన కూడళ్లు, మార్కెట్లు ఇలా ప్రతి సమాచారాన్ని సీసీసీలోని హైఎండ్ డాటా ఎనాలసిస్ సెంటర్‌కు అనుసంధానిస్తారు.
★ హైదరాబాద్ నగరంలో దాదాపు 350 లొకేషన్లలో ఆటోమెటిక్ నంబర్‌ప్లేట్ రీడర్ (ఏఎన్‌పీఆర్), లైసెన్స్ ప్లేట్ క్యాప్చర్ కెమెరా(ఎల్‌పీఆర్)ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలు హైదరాబాద్‌లోకి ప్రవేశించే ప్రతి వాహనం ఫొటోల రూపంలో పంపుతుంది.
★ సీసీటీవీలతోపాటు డయల్ 100, హాక్‌ఐ, సీసీటీఎన్‌ఎస్, క్రైం డాటా అంతా డాటా ఎనాలసిస్ సెంటర్‌లో ఉంటుంది.
★ ఆయా జిల్లా పరిధిలోని అన్ని సీసీటీవీల ఫీడ్, ఇతర సమాచారం ఆ జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అటు నుంచి హైదరాబాద్‌లోని సీసీసీకి అనుసంధానమవుతుంది.
ఇవీ నిర్మాణ ప్రత్యేకతలు :
★ మొత్తం ప్రాజెక్టు నిర్మాణం 6.42 లక్షల చదరపు అడుగుల్లో జరిగింది. బేస్‌మెంట్ ఏరియా 2.16 లక్షల చదరపు అడుగులు, సూపర్ స్ట్రక్చర్ ఏరియా 4.26 లక్షల చదరపు అడుగుల్లో ఉన్నది.
★ మొత్తం ఐదు బ్లాక్‌లుగా నిర్మించారు. టవర్ ‘ఏ’లో గ్రౌండ్‌ఫ్లోర్‌తోపాటు 19 అంతస్తులు, టవర్ ‘బీ’లో రెండు బేస్‌మెంట్లు గ్రౌండ్‌ఫ్లోర్, 15 అంతస్తులు, టవర్ ‘సీ’లో ఆడిటోరియం గ్రౌండ్‌ఫ్లోర్, రెండు అంతస్తులు, టవర్ ‘డీ’లో గ్రౌండ్ ప్లస్ మొదటి అంతస్తు, టవర్ ‘ఈ’లో సీసీసీని 4 నుంచి 7 అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. మరో రెండు బేస్‌మెంట్ లెవల్‌లు .
★ అన్ని టవర్లలో ‘ఏ’ టవర్ ఎత్తయినది. దీనిలో మొత్తం 20 అంతస్తులు ఉన్నాయి. దీనిలోనే నాల్గో అంతస్తులో డీజీపీ చాంబర్, 18వ అంతస్తులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చాంబర్ ఉంటాయి. 7వ అంతస్తులో ప్రముఖుల చాంబర్లు ఏర్పాటు చేశారు.
★ టవర్ ఏ, బీలను 14వ అంతస్తులో కలుపుతూ 400 మెట్రిక్ టన్నుల బరువుతో దేశంలోనే అత్యంత బరువైన స్కైవాక్ వంతెన నిర్మించారు. దీనికి సోలార్ ఫొటోవోల్టిక్ ప్యానల్స్‌తో రూఫ్‌టాప్ ఏర్పాటు చేశారు.
★ ఈ టవర్లు అన్నీ డబుల్ గ్లాస్ కర్టెన్‌వాల్ సిస్టమ్‌లో నిర్మించారు. దీని థర్మల్ కంఫర్ట్ వల్ల విద్యుత్తు ఆదా అవుతుంది.
నైరుతివైపు ఉన్న టవర్‌పైన హెలిపాడ్‌ను ఏర్పాటు చేశారు. వీవీఐపీ మూమెంట్స్‌కోసం హెలికాప్టర్ సేవలను వాడుకోవచ్చు.
★ టవర్లలోని కింది ఫ్లోర్లలో ఆడిటోరియం, కేఫ్, మల్టీపర్పస్‌హాల్, మీడియా సెంటర్, రిసెప్షన్ లాబీ ఏర్పాటుచేశారు.
టవర్ ఏలో 550 వర్క్‌స్టేషన్లు ఉంటాయి. వెయ్యి మంది సిబ్బంది పనిచేయవచ్చు.
★ టవర్ బీలో 580 వర్క్‌స్టేషన్లు ఉన్నాయి. 1500 మంది సిబ్బంది పనిచేయవచ్చు. అన్ని ఫ్లోర్లలోనూ వంటశాల అందుబాటులో ఉంది.
★ ఆడిటోరియంను 590 మంది సీటింగ్ కెపాసిటీతో ఏర్పాటు చేశారు.
★ రెండు బేస్‌మెంట్ పార్కింగ్‌ల్లో 299 కార్లు పార్కింగ్ చేయవచ్చు. 316 టూ వీలర్స్ పార్కింగ్ కెపాసిటీ ఉంది. మరో 301 కార్ల పార్కింగ్ కెపాసిటీని పెంచుకోవచ్చు.
★ టవర్ డీ గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియా బ్రీఫింగ్ హాల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 125 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. మీడియా బ్రీఫింగ్ హాల్‌లో ఆడియో, వీడియో విజువల్ సిస్టం, లైటింగ్ వ్యవస్థ ఉన్నాయి. ప్రెస్ బ్రీఫింగ్‌లకు సంబంధించి లైవ్ కవరేజ్ నేరుగా అక్కడి నుంచే ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.
★ మొత్తం పది ప్యాసింజర్ లిఫ్ట్‌లు, రెండు సర్వీస్ లిఫ్ట్‌లు ఉన్నాయి.
క్షేత్రస్థాయిలో పోలీసులకు మరింత బలం :
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న సీసీసీ.. రోజువారీ పోలీసు విధులు మరింత సమర్ధంగా నిర్వర్తించేందుకు పోలీసులకు మరింత బలంగా మారనుంది. ఫోర్స్ మల్టిప్లయర్‌గా ఉపయోగపడే సీసీసీతో నేరస్థులను పట్టుకోవడం, కేసుల దర్యాప్తులో వేగం పెరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న సాధారణ సీసీటీవీలతోపాటు భద్రత మరింత అవసరమైన చోట్ల ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రూపొందించిన ఎఫ్‌ఆర్‌ఎస్(ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం), క్రౌడ్ మేనేజ్‌మెంట్ సిస్టం వంటి ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా వచ్చే ఫీడ్‌తో క్షణాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది అలర్ట్ అవుతారు. దీంతో శాంతిభద్రతల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ మరింత సులువు అవుతుంది. ఇలా అనేక కోణాల్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ పోలీస్‌కు గుండెకాయ వంటి వ్యవస్థ కాబోతున్నది. హై ఎండ్ డాటా ఎనాలసిస్ సెంటర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉంటుంది. దీనిలో మన రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న క్రిమినల్స్ పూర్తి సమాచారం, ఫింగర్‌ప్రింట్స్, ఫొటోలు, గతంలో వారు చేసిన నేరాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేస్తారు.
ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ :
సీసీసీ ద్వారా అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను పర్యవేక్షించడంతోపాటు ట్రాఫిక్ జాం సమస్యలు తలెత్తకుండా వాహనాల మళ్లింపునకు చర్యలు తీసుకుంటారు. దీనిలో అంతర్గత రహదారులతోపాటు తెలంగాణ నుంచి ఇతర రాష్ర్టాలకు వెళ్లే జాతీయ రహదరాలను సైతం పర్యవేక్షించవచ్చు. అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని సీసీటీవీల ఫుటేజీల ద్వారా గమనించి వారికి చలాన్లు పంపవచ్చు.