మెగాస్టార్ చిరంజీవి పేరు వింటేనే అభిమానుల్లో అంతులేని ఉత్సాహం ఉప్పొంగుతుంది. అభిమానులే కాదు, ఆయనను అందరూ అభిమానిస్తారు, ఇష్టపడతారు. డ్యాన్సులకీ, డైలాగులకీ, నటనకీ ఒక కొత్త ఒరవడిని సృష్టించిన ఘనత ఆయనకు దక్కుతుంది.
అయితే, చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే విషయం మనందరికీ తెలిసిందే. సినీరంగానికొచ్చాక ఆయన చిరంజీవిగా మారారు. అలా కొణిదెల శివశంకర వరప్రసాద్ కాస్తా చిరంజీవిగా మారి సెప్టెంబర్ 22వ తేదీతో 44 ఏళ్లు పూర్తైంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ను పెట్టారు. 1978 సెప్టెంబర్ 22న ‘ప్రాణం ఖరీదు’ విడుదలైందని పేర్కొన్న చిరంజీవి, ఆ సినిమాతోనే తన పేరు చిరంజీవిగా మారిందని గుర్తు చేసుకున్నారు.
‘మీకు తెలిసిన ఈ చిరంజీవి.. చిరంజీవిగా పుట్టిన రోజు ఈ రోజు’ అని ఆయన పేర్కొన్నారు. ప్రాణం ఖరీదు చిత్రంతో ప్రాణం పోసి… అన్నీ మీరే అయి 44 ఏళ్లు నన్ను నడిపించారంటూ ఆయన తెలిపారు. తనను ఇన్నేళ్లుగా ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ చిరు ఎమోషనల్ అయ్యారు. ఏదేమైనా, తెలుగు సినీరంగంలో మెగాస్టార్ వేసిన ముద్ర చెరిగిపోనిది. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది హీరోలైన విషయం మనకు తెలిసిందే…! మరో ముఖ్యమైన విషయమేంటంటే, ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా మెగాస్టార్ కి వున్న క్రేజ్ ఎంతమాత్రం తగ్గకపోవడం… జయహో చిరంజీవి…!!