CM Jagan : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామం వద్ద బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడు ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా… పలువురు గాయపడ్డారు. కాగా ఈ ఘటన సమాచారం తెలుసుకున్న ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి 10లక్షలు ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. అలానే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మృతులను యాళ్ల ప్రసాద్, దెయ్యాల స్వామి, దూళ్ల నానిగా గుర్తించారు. గాయపడిన సాల్మన్ రాజును మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. మృతులను కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరుకు చెందిన వారిగా గుర్తించారు. సాల్మన్ రాజు నల్లజర్ల మండలం అనంతపల్లి నుంచి వచ్చారు. వీళ్లంతా బాణాసంచా పేలుడు కేంద్రంలో పని చేసేందుకు ఇక్కడికి వచ్చారు. ఈ బాణాసంచా తయారీ కేంద్రంలో 15 కేజీల పేలుడు పదార్థం తయారు చేసేందుకే యజమాని అనుమతి తీసుకున్నాడు. కానీ, ఈ నిబంధనకు విరుద్ధంగా సుమారు 100 కేజీలకు పైగా పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నారని సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే ఈ పేలుడు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
కడియద్దలో జరిగిన అగ్నిప్రమాద సంఘటన స్థలానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడియద్ద గ్రామంలో ఒక దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుందని, గడపగడపకు కార్యక్రమంలో ఉన్న సమయంలో సమాచారం తెలిసిన వెంటనే అధికారులను హూటాహూటీన సంఘటన స్థలంకు పంపించి సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. దీపావళి సమయంలో కూడా అధికారులు అనేకసార్లు ఇక్కడ పరిశీలించారని అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. క్షతగాత్రులకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించడం జరుగుతుందని మంత్రి అన్నారు.