CM KCR, Minister KTR, Telangnana News, Telangana Politics, Telangana Development Works, Telugu World Now,
Telangana News: 5వేల కోట్లతో గొర్రెల పంపిణీ పథకం, 4న సీఎం కేసీఆర్ చేతులమీదుగా 1320 బెడ్రూం ఇండ్లు పంపిణీ: పురపాలకశాఖ మంత్రి కేటీఆర్.
రాష్ట్రంలో పలు మార్గాల్లో ఆదాయాన్ని పెంచి పేదలకు పంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. తెలంగాణలో 70 ఏండ్లలో జరుగని అభివృద్ధిని ఏడేండ్లలో చేసి చూపించామని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, డబుల్ బె డ్రూం ఇండ్లు వంటి పథకాలు ఏరాష్ట్రంలోనైనా అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. గురువారం రా జన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేట, జగదాంబతండా, దేశాయిపేట, సముద్రలింగాపూర్‌లో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలను మెచ్చుకుంటూ కేంద్రమే కాపీకొట్టి దేశమంతా అమలుచేస్తుంటే.. కొందరు కావాలని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్, బీజేపీపాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలుచేస్తలేరో ఆ పార్టీల నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 5 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. 57 ఏండ్లు నిండిన వారందరికీ త్వరలో ఫించన్లు ఇస్తామని వెల్లడించారు. రూ.5వేల కోట్లతో యాదవులకు గొర్రెలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 3.50 లక్షల యూనిట్ల గొర్రెలను త్వరలో పంపిణీ చేస్తామని చెప్పారు.
పల్లెలు అభివృద్ధితో సంక్షేమం పరుగులు, దేశానికి పట్టుగొమ్మలైన పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు సంక్షేమంలో పరుగులు పెడుతాయన్న ఉద్దేశంతోనే పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 పంచాతీయల్లో ట్రాక్టర్లు, వాటర్ ట్యాం కర్లు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. దేశాయిపేట సర్పంచు చంద్రకళ భర్త ఎల్లం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.. ఆ కుటుంబానికి మంత్రి తక్షణసాయంగా రూ.5 లక్షల చెక్కును అందజేసి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పదిరోజులపాటు జరిగే పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఊరును పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ నెల 4న సిరిసిల్లకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు మీదుగా 1,320 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తామని వెల్లడించారు. ఆయా కార్యక్రమంలో నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ తదితరులు పాల్గొన్నారు.