Cm Kcr : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని ఎర్రబోడు గ్రామం ఉంది. 30 కుటుంబాలు నివాసం ఉండే ఈ గ్రామంలో సుమారు వంద మంది నివసిస్తున్నారు. 25 సంవత్సరాల క్రితం చత్తీస్ ఘడ్ నుంచి వీళ్ళంతా వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వీరంతా పోడు సాగు చేసుకొని జీవనం సాగు చేస్తున్నారు. పోడు రైతులు, అటవీ అధికారుల మధ్య ఎప్పటినుంచో వివాదాలు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇలాంటి దారుణం ఎక్కడా జరగలేదనే చెప్పాలి. ఏకంగా ఫారెస్ట్ అధికారినే కత్తులతో నరికి చంపిన ఘటనతో రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఎర్రబోడులో ప్లాంటేషన్ మొక్కలను గొత్తి కోయలు నరుకుతుండగా అడ్డుకునేందుకు వెళ్ళిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ పై.. గుత్తి కోయలు దాడి చేశారు. తమకు భూములు దక్కకుండా చేస్తున్నారన్న ఆవేశంతో.. కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్రగాయాలపాలైన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్‌రావును ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు..
శ్రీనివాస్ ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం ఈర్లపూడి గ్రామానికి చెందిన వ్యక్తి. దీంతో శ్రీనివాస్ మరణంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాసరావు హత్య పట్ల సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. 50 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని అధైర్య పడవద్దంటూ భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఏమాత్రం సహించబోమని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. సీఎం డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. శ్రీనివాసరావు అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సీఎం కేసీఆర్ సూచించారు.